Mumbai Family Death: ముంబైలోని పైధోని ప్రాంతంలో గత నెలలో జరిగిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి కేసు సంచలనంగా మారింది. మొదట ఈ ఘటనను ఫుడ్ పాయిజనింగ్‌గా భావించిన పోలీసులు, తాజాగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) నివేదిక రావడంతో అసలు కారణాన్ని గుర్తించారు. కుటుంబ సభ్యులు తిన్న పుచ్చకాయలో ‘జింక్ ఫాస్ఫైడ్’ అనే ఎలుకల మందు కలిసినట్లు తేలింది.
ఇస్మాయిల్ కుర్తే రోడ్‌లోని ఘరీ మొహల్లాలో నివసించే అబ్దుల్లా డొకాడియా (44) కుటుంబం ఏప్రిల్ 25 రాత్రి తమ బంధువులకు విందు ఇచ్చింది. రాత్రి 11:30 తర్వాత బంధువులు వెళ్లిపోయిన అనంతరం, అబ్దుల్లా తన భార్య నస్రిన్ (35), కుమార్తెలు ఆయేషా (16), జైనబ్ (13)తో కలిసి ఇంట్లో ఉన్న పుచ్చకాయను తిన్నారు.
అయితే కొద్దిసేపటికే కుటుంబ సభ్యులందరికీ తీవ్ర వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో పరిస్థితి మరింత విషమించడంతో వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి, అక్కడి నుంచి జేజే ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ మరుసటి రోజే నలుగురూ మృతి చెందారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఫోరెన్సిక్ నిపుణులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. మృతుల కాలేయం, మూత్రపిండాలు, కడుపులోని పదార్థాలు, పొత్తికడుపు కొవ్వు నమూనాల్లో జింక్ ఫాస్ఫైడ్ ఆనవాళ్లు గుర్తించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ ముండే తెలిపారు. వారు తిన్న పుచ్చకాయ నమూనాల్లో కూడా ఇదే విషపూరిత రసాయనం ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఇంట్లోని ఇతర ఆహార పదార్థాల్లో విషం ఆనవాళ్లు కనిపించలేదు.
జింక్ ఫాస్ఫైడ్ అనేది ఎలుకలను చంపేందుకు ఉపయోగించే ప్రమాదకరమైన విషపదార్థం. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత ఫాస్ఫైన్ వాయువును విడుదల చేసి అంతర్గత అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ విషం పుచ్చకాయలోకి ఎలా చేరిందనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది.
ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా, లేక ఎవరైనా కావాలనే చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో లేదని ప్రాథమిక దర్యాప్తులో తెలిసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంట్లో ఎలుకల మందు వాడే సమయంలో పొరపాటున పుచ్చకాయకు లేదా దాన్ని కోసిన కత్తికి ఆ విషం అంటి ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు.
జేజే మార్గ్ పోలీసులు ఇప్పటికే కుటుంబ సభ్యుల బంధువులు, పొరుగువారి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి విషం శరీరంలోకి ఎలా చేరిందనే అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఒకేసారి కుటుంబంలోని నలుగురు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.
Also Read: Bhagyashri Borse: గ్లామరస్ లుక్ లో పిచ్చెక్కిస్తోన్న భాగ్యశ్రీ బోర్సే
Mumbai Family Death: పుచ్చకాయలో ఎలుకల మందు… ఆ మరణాలకు అసలు కారణమదే!
