Artemis II: చంద్రుడి చుట్టూ విజయవంతంగా ప్రయాణం పూర్తి చేసిన ఆర్టెమిస్-2 మిషన్ భూమికి సురక్షితంగా తిరిగి వచ్చింది. కాలిఫోర్నియా సమీపంలోని శాన్ డియాగో తీరంలో, పసిఫిక్ మహాసముద్రంలో ఒరాయన్ క్యాప్సూల్ ల్యాండ్ అయింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5:38 గంటలకు వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. దీంతో పది రోజుల పాటు సాగిన ఈ అంతరిక్ష యాత్ర విజయవంతంగా ముగిసింది.
చంద్రుడి వద్దకు మానవులను పంపే లక్ష్యంతో నాసా ఈ నెల 1న ఆర్టెమిస్-2 మిషన్‌ను ప్రయోగించింది. ఈ యాత్రలో అమెరికాకు చెందిన రీడ్ వైస్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్ మరియు కెనడాకు చెందిన జెరెమీ హాన్సన్ పాల్గొన్నారు. ఈ మిషన్‌లో వారు సుమారు 4,06,771 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఇప్పటివరకు మానవులు వెళ్లిన అత్యంత దూర ప్రయాణంగా రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో అపోలో-13 రికార్డును కూడా అధిగమించారు.
ఈ యాత్రలో వ్యోమగాములు చంద్రుడి అవతలి వైపు అరుదైన దృశ్యాలు, సంపూర్ణ సూర్యగ్రహణం వంటి విశేషాలను చిత్రీకరించారు. భూమి వాతావరణంలోకి ఒరాయన్ క్యాప్సూల్ అత్యంత వేగంతో ప్రవేశించి, తరువాత మూడు భారీ పారాచూట్ల సాయంతో సముద్రంలో సాఫీగా దిగింది. దీనికి సంబంధించిన వీడియోలను నాసా విడుదల చేసింది.
ఈ సందర్భంగా నాసా సోషల్ మీడియా వేదికలో స్పందిస్తూ, “రీడ్, విక్టర్, క్రిస్టినా, జెరెమీలకు స్వాగతం. ఆర్టెమిస్ వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. చంద్రుడి చుట్టూ వారి చారిత్రాత్మక 10 రోజుల మిషన్ విజయవంతమైంది” అని తెలిపింది.
ఆర్టెమిస్-2 మిషన్ విజయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ట్రూత్ సోషల్‌లో స్పందిస్తూ, “ఈ ప్రయాణం అద్భుతంగా సాగింది. ల్యాండింగ్ కూడా పరిపూర్ణంగా జరిగింది. త్వరలోనే మిమ్మల్ని వైట్ హౌస్‌లో కలుసుకోవాలని ఎదురుచూస్తున్నాను. మన తదుపరి లక్ష్యం అంగారక గ్రహం” అని అభినందనలు తెలిపారు.
Orion’s main parachute has deployed. The spacecraft has a system of 11 chutes that will slow it down from around 300 mph to 20 mph for splashdown.
Get more updates on the Artemis II blog: https://t.co/7gicm7DWBt pic.twitter.com/ReXHTfkFld
— NASA (@NASA) April 11, 2026
