Smart Phone: ఈ రోజుల్లో వ్యాపారం, వినోదం, సోషల్ కనెక్షన్స్ లాంటి వాటి కోసం స్క్రీన్ల వాడకం మన జీవితంలో భాగమైపోయింది. పూర్తిగా వాటిని దూరం పెట్టడం సాధ్యం కాకపోయినా, అధికంగా వాడటం కంటి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. కళ్ళు పొడిబారడం నుంచి మొదలుకుని, పిల్లల్లో చిన్న వయసులోనే దృష్టి లోపాలు రావడం వరకు కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
న్యూఢిల్లీలోని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ సీనియర్ ఆప్తాల్మాలజిస్ట్ డాక్టర్ ప్రభ్‌జోత్ కౌర్ ప్రకారం, ఎక్కువసేపు స్క్రీన్ చూస్తే డిజిటల్ ఐ స్ట్రెయిన్ సమస్య వస్తుంది. దీంతో కళ్ళు పొడిబారడం, మసకగా కనిపించడం, చికాకు వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువ స్క్రీన్ టైమ్ కారణంగా మయోపియా (హ్రస్వదృష్టి) త్వరగా వచ్చే ప్రమాదం ఉంది.
పిల్లల విషయంలో స్క్రీన్ టైమ్‌కు కచ్చితమైన పరిమితులు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రెండు సంవత్సరాల లోపు పిల్లలకు స్క్రీన్ టైమ్ అస్సలు ఉండకూడదు. 2 నుంచి 5 సంవత్సరాల మధ్య పిల్లలకు రోజుకు ఒక గంటలోపు మాత్రమే, ఆపై పెద్ద పిల్లలకు రోజుకు రెండు గంటల కంటే తక్కువగా ఉండాలి. కానీ వాస్తవంగా చూస్తే చిన్న పిల్లలు కూడా ఎక్కువసేపు స్క్రీన్ ముందు గడుపుతున్నారు, ఇది ఆందోళన కలిగించే విషయం.
పెద్దల విషయానికి వస్తే ఖచ్చితమైన పరిమితులు లేకపోయినా, మితంగా వాడటం చాలా ముఖ్యం. ముఖ్యంగా సోషల్ మీడియా వంటి వినోదాత్మక స్క్రీన్ టైమ్‌ను రోజుకు రెండు గంటలలోపే ఉంచాలని సూచిస్తున్నారు. అలాగే నిద్రకు వెళ్లే ముందు కనీసం ఒక గంట స్క్రీన్లకు దూరంగా ఉండటం మంచిది. పని కారణంగా ఎక్కువసేపు స్క్రీన్ వాడాల్సి వస్తే మధ్య మధ్యలో విరామాలు తీసుకోవాలి.
కంటి ఒత్తిడిని తగ్గించడానికి 20-20-20 నియమం చాలా ఉపయోగకరం. అంటే ప్రతి 20 నిమిషాలకు, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి. ఇది కంటి కండరాలకు విశ్రాంతి ఇచ్చి అలసటను తగ్గిస్తుంది.
అలాగే కొన్ని చిన్న అలవాట్లు పాటించడం ద్వారా కూడా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. క్రమం తప్పకుండా విరామాలు తీసుకోవాలి, విరామ సమయంలో మరో స్క్రీన్ చూడకుండా ఉండాలి. సరైన వెలుతురు, సరిగ్గా కూర్చునే భంగిమ పాటించాలి. శరీరంలో నీరు తగినంతగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే కంటి తేమ కోసం ఐ డ్రాప్స్ ఉపయోగించవచ్చు.
ఎక్కువసేపు దగ్గరగా స్క్రీన్ చూడటం వల్ల కనురెప్పలు కొట్టే సంఖ్య తగ్గి, కళ్ళు పొడిబారడం, మసక చూపు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మొత్తానికి, స్క్రీన్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ వాటి వాడకాన్ని నియంత్రించడం, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
