Viral: పిల్లలు బాగా చదివి మంచి స్థాయికి చేరాలని తల్లిదండ్రులు ఎంతో ఆశతో పెద్ద కాలేజీల్లో చేర్పించి, లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ కొంతమంది విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టకుండా ఫోన్లు, రీల్స్, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతూ తమ భవిష్యత్తును తామే దెబ్బతీసుకుంటున్నారు. పరీక్షల సమయంలో మాత్రం సరైన సిద్ధత లేక అడ్డదారులు వెతుకుతూ ఉంటారు.
సాధారణంగా ఇలాంటి విద్యార్థులు ఆన్సర్ షీట్లలో టీచర్లను పాస్ చేయమని వేడుకోవడం, కొందరు డబ్బులు పెట్టడం, మరికొందరు కథలు, పాటలు రాసి పేజీలు నింపడం జరుగుతుంటుంది. తాజాగా తెలంగాణలో ఇంటర్ పరీక్షల మూల్యాంకనం జరుగుతున్న సమయంలో ఇలాంటి ఒక విచిత్ర ఘటన బయటపడింది.
ఓ విద్యార్థి తన ఆన్సర్ షీట్‌లో రాసిన మాటలు, గీసిన బొమ్మలు చూసి ఎగ్జామినర్ ఆశ్చర్యపోయాడు. ఆ షీట్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. ఆ విద్యార్థి “సార్.. నాకు అమ్మానాన్న లేరు. మీరే నాకు అన్నీ. దయచేసి నన్ను పాస్ చేయండి. నేను చదివింది ప్రశ్నల్లో రాలేదు. దేవుడిలా మీరు నన్ను కాపాడాలి” అంటూ వేడుకున్నాడు. అంతేకాకుండా గురువు కాళ్లకు నమస్కారం చేస్తున్నట్లుగా ఒక బొమ్మ గీసి, “ఇది నేను, ఇది సార్” అని కూడా పేర్కొన్నాడు.
ఈ ఘటన నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఇది చూసి నవ్వుకుంటుంటే, మరికొందరు చదువుపై శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో స్పష్టత లేకపోయినా, విద్యార్థి రాసిన విధానం మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
