Bomb Threats: 1,100 సార్లు బాంబు బెదిరింపులు.. మొత్తానికి దొరికాడు!

Delhi Police arrests Mysuru man for sending over 1,100 hoax bomb threats to schools, govt offices

Delhi Police arrests Mysuru man for sending over 1,100 hoax bomb threats to schools, govt offices

Bomb Threats: దేశవ్యాప్తంగా స్కూళ్లు, ఆఫీసులు, కోర్టులకు వరుసగా వచ్చిన నకిలీ బాంబు బెదిరింపుల కేసులో కీలక పురోగతి నమోదైంది. సుమారు 1100 సార్లు బాంబు బెదిరింపు సందేశాలు పంపిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు కర్నాటకలోని మైసూరులో అరెస్టు చేశారు. నిందితుడిని 47 ఏళ్ల శ్రీనివాస్ లూయిస్‌గా గుర్తించారు.

ఢిల్లీ పోలీసులతో కలిసి స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి, మైసూరులోని వృందావనం లేఅవుట్‌లో అతను కిరాయి ఉంటున్న ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు, అసెంబ్లీ, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు వందల సంఖ్యలో వచ్చిన బాంబు బెదిరింపుల వెనుక ఇదే వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు.

పోలీసుల విచారణలో శ్రీనివాస్ లూయిస్ ఈమెయిల్స్‌తో పాటు ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా బెదిరింపులు పంపినట్లు అంగీకరించాడు. తన అసలు గుర్తింపును దాచేందుకు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) వాడినట్లు కూడా బయటపడింది. VPN ద్వారా పంపిన మెయిల్స్‌ను ట్రాక్ చేయడం కష్టమైనప్పటికీ, ఒక మొబైల్ నంబర్ ఆధారంగా అతడిని గుర్తించారు.

సైబర్ క్రైమ్ విభాగం రెండు వారాల పాటు సాంకేతిక నిఘా పెట్టి, డిజిటల్ ఆధారాలతో నిందితుడి స్థానం గుర్తించింది. అతని మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు బెంగళూరుకు చెందినవాడు. పీజీ చదివినా ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడు. తల్లితో కలిసి నివసిస్తున్న అతను మానసిక ఒత్తిడిలో ఉన్నాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు కాగా, పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read: Live-in Couples: సహజీవన జంటలకూ కుటుంబ హోదా

Bomb Threats: 1,100 సార్లు బాంబు బెదిరింపులు.. మొత్తానికి దొరికాడు!