Live-in Couples: దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత దేశవ్యాప్తంగా 16వ జనాభా గణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా, ఈసారి పలు కీలక మార్పులు చేపట్టింది. ముఖ్యంగా సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సహజీవన జంటలను కూడా ఒకే కుటుంబంగా గుర్తించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాలను రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ వెల్లడించారు.
ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో రెండు దశల్లో జరుగుతుంది. తొలి దశలో గృహ గణన చేపట్టి, అధికారులు మొబైల్ యాప్ల సహాయంతో ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. కుటుంబ సభ్యుల సంఖ్య, వయస్సు, విద్య వంటి ముఖ్య సమాచారాన్ని నమోదు చేస్తారు. అలాగే పౌరులు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించారు.
జనగణన కోసం 33 ప్రశ్నలతో ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించారు. ఇందులో ఇంటి యజమాని పేరు, కులం, కమ్యూనిటీ, కుటుంబ వివరాలతో పాటు తాగునీటి వనరులు, మరుగుదొడ్ల వినియోగం, వంటగది సదుపాయాలు, వాడే ఇంధనం వంటి అంశాలు ఉంటాయి. అదనంగా ఇంటర్నెట్, ఫోన్లు, వాహనాలు, టీవీ, రేడియో వంటి సౌకర్యాలపై కూడా సమాచారం సేకరిస్తారు. ఈసారి తృణధాన్యాల వినియోగంపై కూడా ప్రశ్నలు ఉండనున్నాయి.
సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరిగే జనగణన చివరిసారిగా 2011లో నిర్వహించారు. 2021లో జరగాల్సిన ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ ప్రారంభమవుతున్న ఈ గణన దేశ జనాభా పరిస్థితులపై స్పష్టత ఇవ్వడంతో పాటు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు కీలకంగా మారనుంది.
Also Read: Cooling Water: వేసవిలో కూలింగ్ వాటర్ తాగితే?
Live-in Couples: సహజీవన జంటలకూ కుటుంబ హోదా
