Petrol Crisis: మరో డేంజర్.. ముదరనున్న చమురు సంక్షోభం?

Iran Threatens to Block Bab-el-Mandeb Strait, Global Oil Trade at Risk

Iran Threatens to Block Bab-el-Mandeb Strait, Global Oil Trade at Risk

Petrol Crisis: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఈ యుద్ధ వాతావరణంలో ఇరాన్ చేసిన తాజా ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. తమ భూభాగం లేదా ద్వీపాలపై దాడి జరిగితే, కీలక సముద్ర మార్గాలపై నియంత్రణ కఠినతరం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ముఖ్యంగా బాబ్ అల్-మండేబ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉందని ఇరాన్‌కు చెందిన తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ నివేదిక పేర్కొంది.

ఇప్పటికే ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో కీలక పాత్ర పోషించే హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ప్రభావం చూపుతోంది. ఇప్పుడు బాబ్ అల్-మండేబ్ జలసంధి కూడా ప్రభావితమైతే, ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు మార్గాలు కలిసి ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో పెద్ద భాగాన్ని నియంత్రిస్తాయి.

అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌కు చెందిన ద్వీపాలను లక్ష్యంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఇటీవల వార్తలు రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్‌కు 30కి పైగా ద్వీపాలు ఉన్నాయి. వీటిలో కొన్ని చమురు, గ్యాస్ ఎగుమతులు, సముద్ర భద్రత, హోర్ముజ్ జలసంధి పర్యవేక్షణకు కీలకంగా ఉంటాయి. అందుకే ఈ ద్వీపాలపై దాడి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ స్పష్టం చేసింది.

ఇక బాబ్ అల్-మండేబ్ జలసంధి ప్రాముఖ్యతను చూస్తే, ఇది ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. అరబిక్‌లో దీని అర్థం “కన్నీటి ద్వారం”. ఈ జలసంధి ఎర్ర సముద్రాన్ని, అడెన్ గల్ఫ్‌ను, అరేబియా సముద్రాన్ని కలుపుతుంది. ఇది యెమెన్ మరియు ఆఫ్రికాలోని జిబౌటి, ఎరిట్రియా దేశాల మధ్య ఉంటుంది. కేవలం 29 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ మార్గం చాలా ఇరుకైనదైనా, అత్యంత కీలకమైనది.

యూరప్, ఆసియా, మధ్యప్రాచ్య దేశాల మధ్య జరిగే చమురు, గ్యాస్ రవాణాలో ఈ మార్గం ముఖ్య పాత్ర పోషిస్తుంది. సూయజ్ కాలువ ద్వారా ప్రయాణించే నౌకలు తప్పనిసరిగా ఈ జలసంధి గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ మార్గం మూసివేస్తే, నౌకలు ఆఫ్రికా ఖండం చుట్టూ కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణ సమయం 15 నుంచి 20 రోజులు పెరగడంతో పాటు, రవాణా ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయి.

నివేదికల ప్రకారం, ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12 శాతం ఈ బాబ్ అల్-మండేబ్ మార్గం గుండా జరుగుతుంది. అలాగే ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ సరఫరాలో సుమారు 10 శాతం ఈ మార్గంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ హోర్ముజ్‌తో పాటు ఈ జలసంధి కూడా ప్రభావితమైతే, ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో 30 శాతం వరకు అంతరాయం కలగొచ్చని నిపుణులు చెబుతున్నారు.

భారత్‌కు కూడా ఈ మార్గం చాలా ముఖ్యమైనది. భారత్ నుంచి యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే దిగుమతులు, ఎగుమతులు ఎక్కువగా సూయజ్ కాలువ మార్గంలోనే సాగుతాయి. ఈ మార్గంలో ప్రయాణించాలంటే బాబ్ అల్-మండేబ్ జలసంధిని తప్పనిసరిగా దాటాల్సి ఉంటుంది. అందువల్ల ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారత్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

Also Read: Petrol Shortage: ఇదేందయ్యా ఇది.. కుక్కర్లు, బకెట్లలో పెట్రోల్!

Petrol Crisis: మరో డేంజర్.. ముదరనున్న చమురు సంక్షోభం?