LPG Shortage: హార్మోజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఎల్పీజీ గ్యాస్ కొరత నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చాయి. డబుల్, సింగిల్, ఉజ్వల కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఈ మార్పులను ముందుగానే తెలుసుకోవాల్సి ఉంది. లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
కొత్త నిబంధనల ప్రకారం, డబుల్ సిలిండర్ కనెక్షన్ ఉన్నవారు 35 రోజుల తర్వాత మాత్రమే కొత్త సిలిండర్ బుక్ చేసుకోవాలి. సింగిల్ సిలిండర్ ఉన్నవారికి ఈ గడువు 25 రోజులు. ఉజ్వల కనెక్షన్ ఉన్న వినియోగదారులు 45 రోజుల తర్వాతే బుకింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ గడువుకంటే ముందే బుకింగ్ చేయడానికి ప్రయత్నిస్తే, సిస్టమ్ ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది. ఈ నియమాలు వెంటనే అమల్లోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.
ఇక వాణిజ్య సిలిండర్ల విషయంలో కూడా పరిమితులు విధించారు. అత్యవసర సేవలు, విద్యాసంస్థలకు మాత్రమే కమర్షియల్ సిలిండర్లను సరఫరా చేస్తున్నట్లు ఎల్పీజీ అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ తెలిపారు. సిలిండర్ల కొరత కారణంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా, దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రిఫైనరీలు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ప్రజలు భయంతో అధికంగా కొనుగోలు చేయకుండా ఉండాలని పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుజాత శర్మ సూచించారు.
ఇంకా, సంవత్సరానికి అనుమతించిన 12 సిలిండర్లు పూర్తిగా వినియోగించిన తర్వాత మళ్లీ బుకింగ్ చేయాలంటే యాప్‌లోకి వెళ్లి కొన్ని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సంఖ్య, అవసరాల వివరాలు, పెళ్లిళ్లు వంటి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
కొత్త నిబంధనల ప్రకారం నగర ప్రాంతాల్లో బుకింగ్ గడువు 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచగా, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులుగా నిర్ణయించారు. అలాగే గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో ఓటీపీ ఇవ్వడం కూడా తప్పనిసరి చేశారు.
