Health Tips: రాత్రంతా బాగా నిద్రపోతే ఉదయం ఫ్రెష్‌గా లేవడం సహజం. కానీ ఇప్పుడు చాలామందికి నిద్రపోయినా అలసటగా, చిరాకుగా ఉండే సమస్య కనిపిస్తోంది. నిద్ర సరిపోలేదనే భావనతో రోజును ప్రారంభించడం సాధారణమైపోయింది. దీనికి ముఖ్య కారణాలు నిద్ర సైకిల్ సరిగా పూర్తికాకపోవడం, జీవనశైలి లోపాలు, ఒత్తిడి వంటివి. అందుకే కొన్ని చిన్న మార్పులతో నిద్ర నాణ్యతను మెరుగుపరచుకోవచ్చు.
నిద్ర సమయం పాటించాలి
వీలైనంత వరకు రాత్రి 11 గంటలలోపు నిద్రపోవడం మంచిది. అలాగే ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. ఇది శరీరంలోని బయోలాజికల్ క్లాక్‌ను సరిచేస్తుంది.
ఒత్తిడి తగ్గించుకోవాలి
రాత్రి నిద్ర రాకపోవడానికి ప్రధాన కారణం ఒత్తిడి. రోజంతా పని, టెన్షన్ వల్ల మెదడు రిలాక్స్ అవ్వదు. అందుకే పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత ఉండాలి. కుటుంబంతో గడపడం, మీకు ఇష్టమైన పనులు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
కెఫీన్ పరిమితం చేయాలి
టీ, కాఫీ, కూల్ డ్రింక్స్‌లో ఉండే కెఫీన్ నిద్రపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా సాయంత్రం 5 తర్వాత వీటిని తగ్గించడం మంచిది. వాటి బదులుగా హెర్బల్ టీలు (చామంతి, వలేరియన్ వంటి) తీసుకుంటే శరీరం రిలాక్స్ అవుతుంది.
ఆహారంపై జాగ్రత్త
రాత్రి భోజనం తేలికగా ఉండాలి. పడుకునే ముందు కనీసం 2 గంటల ముందు భోజనం పూర్తి చేయాలి. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం సరిగా పనిచేసి రాత్రి నిద్ర సులభంగా వస్తుంది.
ధ్యానం, యోగా
ధ్యానం, డీప్ బ్రీతింగ్, యోగా వంటి వ్యాయామాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, హాబీలను కొనసాగించడం కూడా మంచి ఫలితాలు ఇస్తాయి.
గోరువెచ్చని నీటితో స్నానం
పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. అరోమా ఆయిల్స్ వాడితే మరింత ప్రశాంతత కలుగుతుంది.
వ్యాయామం అవసరం
రోజూ కనీసం అరగంట నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి. శరీరం అలసిపోవడం వల్ల రాత్రి నిద్ర బాగా పడుతుంది.
స్క్రీన్ టైమ్ తగ్గించాలి
పడుకునే ముందు మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్ వాడకాన్ని తగ్గించాలి. వీటి నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రను ఆలస్యం చేస్తుంది. కనీసం 1–2 గంటల ముందు వీటిని పక్కన పెట్టడం మంచిది.
సరైన నిద్ర వాతావరణం
గది చాలా వేడిగా లేదా చల్లగా కాకుండా సౌకర్యవంతంగా ఉండాలి. చీకటి వాతావరణం నిద్రకు సహాయపడుతుంది. మెలటోనిన్ ఉత్పత్తి పెరిగి నిద్ర మెరుగుపడుతుంది.
ఉదయం త్వరగా లేవడం
సూర్యోదయ సమయంలో లేవడం వల్ల శరీరం సహజ రీతిలో పనిచేస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ అలవాట్లు పాటిస్తే కొద్ది రోజుల్లోనే నిద్ర నాణ్యత మెరుగవుతుంది. అయినా సమస్య కొనసాగితే వైద్యులను సంప్రదించడం మంచిది. సరైన నిద్ర మన ఆరోగ్యానికి అత్యంత అవసరం.
