Pimples: ముఖంపై మొటిమలు పోవాలంటే.. ఈ ఫుడ్ అస్సలు తినొద్దు

Can Food Help or Worsen Acne?

Can Food Help or Worsen Acne?

Pimples: మొటిమల సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఖరీదైన క్రీములు వాడినా కొన్నిసార్లు ఆశించిన ఫలితం కనిపించదు. అయితే చర్మ సమస్యలు కేవలం బయట నుంచి వచ్చే కారణాల వల్ల మాత్రమే కాదు, మనం తీసుకునే ఆహారంతో కూడా సంబంధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బెంగళూరులోని స్పార్ష్ హాస్పిటల్‌కు చెందిన డెర్మటాలజీ నిపుణుడు డాక్టర్ సూర్య ఎస్ మొటిమలు తగ్గించేందుకు డైట్‌లో చేయాల్సిన మార్పుల గురించి వివరించారు.

మొటిమలపై ఆహారం ప్రభావం

డాక్టర్ సూర్య ఎస్ ప్రకారం, మొటిమలు కేవలం చర్మ సమస్య మాత్రమే కాదు. అవి శరీరంలోని అంతర్గత ఆరోగ్య పరిస్థితిని కూడా తెలియజేస్తాయి. పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకుంటే చర్మం సహజంగానే మెరిసిపోతుంది. అందుకే కూరగాయలు, పండ్లు రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు.

చర్మానికి అవసరమైన ముఖ్య పోషకాలు

  • యాంటీ ఆక్సిడెంట్లు: ఇవి చర్మ కణాలను రక్షిస్తాయి. బెర్రీలు, ఆకుకూరలు వంటి తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది.
  • ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: చర్మంలో వాపు తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. వాల్‌నట్స్, అవిసె గింజలు, చేపల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి.
  • జింక్ మరియు విటమిన్లు: నట్స్, విత్తనాలు, తృణధాన్యాలు తీసుకోవడం వల్ల చర్మం లోపల నుంచి శుభ్రపడుతుంది.

మొటిమలు తగ్గేందుకు తినాల్సిన ఆహారం

క్యారెట్, బీట్‌రూట్:
క్యారెట్‌లో విటమిన్ A అధికంగా ఉంటుంది. ఇది చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. బీట్‌రూట్ రక్తాన్ని శుభ్రపరచి ముఖానికి సహజ కాంతిని ఇస్తుంది.

గుమ్మడి గింజలు:
ఇవిలో జింక్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. హార్మోన్ల సమతుల్యతను కూడా కాపాడుతుంది.

పసుపు:
పసుపులో ఉండే కుర్కుమిన్ శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది చర్మంపై వాపు, ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది.

నిమ్మకాయ, దానిమ్మ:
నిమ్మకాయలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ముడతల నుంచి కాపాడతాయి.

కీరదోస, బ్రకోలీ:
కీరదోస శరీరాన్ని చల్లబరచి చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. బ్రకోలీలో ఉండే విటమిన్లు, ఫైబర్ చర్మ రంధ్రాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి.

మొటిమలు పెరగడానికి కారణమయ్యే ఆహారం

పాలు, పాల ఉత్పత్తులు:

కొంతమందిలో పాలలోని హార్మోన్లు చర్మ గ్రంథులను ప్రభావితం చేసి మొటిమలు పెరగడానికి కారణమవుతాయి.

చాక్లెట్లు, చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు:

తీపి పదార్థాలు ఇన్సులిన్ స్థాయిలను పెంచి చర్మంలో వాపును పెంచుతాయి.

సోడా, ఆల్కహాల్, కాఫీ:

ఈ పానీయాలు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. కెఫీన్ అధికంగా తీసుకుంటే ఒత్తిడి పెరిగి మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది.

చిప్స్, వైట్ బ్రెడ్ వంటి జంక్ ఫుడ్:

నూనెలో వేయించిన ఆహారం, మైదాతో చేసిన పదార్థాలు రక్తంలో చక్కెరను పెంచి చర్మ సమస్యలకు దారితీస్తాయి.

నిపుణుల సూచనలు

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం బయట వాడే క్రీములు సరిపోవు. పోషకాహారం, సరైన జీవనశైలి చాలా ముఖ్యం. తగినంత నీరు తాగడం, రాత్రిపూట సరైన నిద్రపోవడం కూడా చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయని డాక్టర్ సూర్య తెలిపారు.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే చర్మం లోపల నుంచి శుభ్రపడి మొటిమలు తగ్గి సహజమైన నిగారింపు వస్తుంది.

Also Read: Telangana: చాక్లెట్ ఇస్తానని చెప్పి.. ఆరేళ్ల చిన్నారిపై దారుణం

Pimples: ముఖంపై మొటిమలు పోవాలంటే.. ఈ ఫుడ్ అస్సలు తినొద్దు