Artificial Intelligence: ఈ రోజుల్లో సమాచారం తెలుసుకోవడానికి లేదా పనులను త్వరగా పూర్తి చేసుకోవడానికి చాలామంది ఏఐ టూల్స్ ఉపయోగిస్తున్నారు. ఏ చిన్న సందేహం వచ్చినా, లేదా పనిని సులభంగా చేయాలన్నా చాలా మంది చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, గ్రోక్ వంటి ఏఐ చాట్బాట్లను ఆశ్రయిస్తున్నారు. అందుకే ఈ ఫ్లాట్‌ఫారమ్‌లకు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. కొత్త కొత్త ఏఐ టూల్స్ కూడా మార్కెట్లోకి వస్తుండగా, ఇప్పటికే ఉన్న కంపెనీలు తమ సేవలను మెరుగుపరుస్తూ అప్డేటెడ్ వెర్షన్లను విడుదల చేస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ కంపెనీల మధ్య పోటీ కూడా పెరుగుతోంది.
అయితే ఏఐ టూల్స్ ఉపయోగించడం ఎంత ఉపయోగకరమో, అంతే జాగ్రత్తలు కూడా అవసరం. కొన్ని విషయాల్లో అవి ఉపయోగించడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సున్నితమైన సమాచారం ఇవ్వకండి
కొంతమంది ఏఐ టూల్స్‌ను అతిగా ఉపయోగిస్తూ ప్రతి విషయానికి వాటినే అడుగుతుంటారు. కానీ వ్యక్తిగతంగా సున్నితమైన సమాచారాన్ని ఏఐలో నమోదు చేయడం ప్రమాదకరం. ముఖ్యంగా ఓటీపీలు, బ్యాంక్ పాస్వర్డులు, ఆధార్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటి సమాచారాన్ని ఏఐ చాట్బాట్లలో టైప్ చేయకూడదు. ఇలా చేస్తే మీ వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
చట్టవిరుద్ధ విషయాలు అడగకండి
హ్యాకింగ్ ఎలా చేయాలి, పన్నులు ఎలా ఎగ్గొట్టాలి వంటి చట్టవిరుద్ధమైన విషయాల గురించి ఏఐని అడగడం కూడా మంచిది కాదు. ఆన్లైన్లో చేసే సెర్చ్‌లపై కొన్నిసార్లు నిఘా ఉండే అవకాశముంది. కాబట్టి ఇలాంటి విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం.
ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు జాగ్రత్త
కొంతమంది అనారోగ్యం వచ్చినప్పుడు ఏఐని అడిగి ఏ మందులు వాడాలి అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఏఐ ఇచ్చే సమాచారం ప్రతిసారి సరైనదే అవుతుందని చెప్పలేం. కొన్నిసార్లు తప్పు సూచనలు కూడా రావచ్చు. అందువల్ల ఆరోగ్య సమస్యల విషయంలో డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
వ్యక్తిగత, కుటుంబ విషయాలు పంచుకోవద్దు
మీ కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి, సామాజిక విషయాలు వంటి విషయాలను కూడా ఏఐతో పంచుకోవడం మంచిది కాదు. ఈ సమాచారం బయటకు వెళ్లే ప్రమాదం ఉండొచ్చు.
మొత్తానికి ఏఐ టూల్స్ మన పనులను సులభతరం చేయడంలో సహాయపడతాయి. అయితే వాటిని ఉపయోగిస్తున్నప్పుడు వ్యక్తిగత సమాచారం, చట్టవిరుద్ధ విషయాలు, ఆరోగ్య సలహాలు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం.
