Telangana: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంకా పెండింగ్‌లో ఉన్న కొన్ని ముఖ్య హామీలపై ఇప్పుడు తుది నిర్ణయం తీసుకునే దశకు చేరింది. ముఖ్యంగా 18 సంవత్సరాలు పూర్తైన మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, అలాగే వృద్ధాప్య పెన్షన్‌ను రూ.4,000కు పెంచే అంశాలపై త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయాలను ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 2026–27 వార్షిక బడ్జెట్‌లో ప్రకటించే దిశగా ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈసారి సమావేశాలను దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. బడ్జెట్ రూపకల్పన పనులు ఇప్పటికే వేగంగా కొనసాగుతున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో శాఖలవారీగా ప్రీ-బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాయి. వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి అవసరాలపై చర్చించారు.
ఈసారి బడ్జెట్‌లో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా పెద్దపీట వేయనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. రైతు సంక్షేమం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి ఆరు గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశముంది. అదనంగా నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి రంగాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన పెండింగ్ హామీలను అమలు చేయడంపై మరింత దృష్టి సారిస్తోంది. సంక్రాంతి సమయంలోనే ఈ పథకాలపై ప్రకటన ఉంటుందని భావించినప్పటికీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆలస్యం అయింది. ఇక ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో బడ్జెట్ సమావేశాలపై అధికారిక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ముందున్న స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించి జరిగే ఎన్నికల నేపథ్యంలో సంక్షేమ హామీల అమలు రాజకీయంగా కూడా ప్రాధాన్యత పొందుతోంది. అందుకే ఈసారి బడ్జెట్‌పై ప్రజల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ పెద్దఎత్తున ఆసక్తి నెలకొంది.
