Gas Shortage: హైదరాబాద్ నగరం రోజురోజుకు కాస్మొపాలిటన్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎప్పుడైనా ఆహారం దొరికే పరిస్థితి ఉంటుంది. రోడ్డుపక్కన ఉన్న తోపుడు బండ్ల నుంచి స్టార్ హోటళ్ల వరకు ఉదయం నుంచి రాత్రివరకు వివిధ రకాల అల్పాహారాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఉదయం ఆరు నుంచి పది గంటల మధ్య నగరంలోని టిఫిన్ సెంటర్లు, ఉడుపి హోటళ్లు, రోడ్‌సైడ్ బండ్లు జనంతో కిటకిటలాడుతుంటాయి. గ్యాస్ స్టౌలపై తయారయ్యే ఇడ్లీ, దోశ, పూరీ, వడ, బోండా వాసనలు చుట్టూ వ్యాపించి ఆకలి పెంచుతుంటాయి.
అయితే బుధవారం ఉదయం నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ దృశ్యం కనిపించలేదు. చాలా టిఫిన్ సెంటర్లు తమ స్టౌలను వెలిగించకుండా “గ్యాస్ లేదు.. వంట చేయలేం” అంటూ బోర్డులు పెట్టాయి. దీంతో ఉదయాన్నే అల్పాహారం కోసం వచ్చిన వారు నిరాశతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కొన్ని హాస్టళ్లలో కూడా టీ, టిఫిన్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో నగరంలో ఒకప్పుడు లాక్డౌన్ సమయంలో కనిపించిన పరిస్థితులు మళ్లీ తలెత్తుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
సంక్షోభంలో హోటళ్లు, మెస్‌లు
వంట గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్‌లోని హోటళ్లు, మెస్‌లు, పీజీ హాస్టళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చాలాచోట్ల ఉదయం అల్పాహారం ఇవ్వడం నిలిపివేశారు. కొన్ని చిన్న హోటళ్లు పూర్తిగా సేవలను ఆపివేశాయి. ఐటీ కారిడార్ ప్రాంతాల్లోని హోటల్స్ అసోసియేషన్లు కూడా టీ, కాఫీ, టిఫిన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నగరంలోని ఫుడ్ ఇండస్ట్రీలో దాదాపు 90 శాతం వరకు కార్యకలాపాలు నిలిచిపోవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమీర్‌పేట్, ఎస్ఆర్నగర్, కేపీహెచ్పీ, మాదాపూర్, కొండాపూర్, అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్ వంటి ప్రాంతాల్లో ఉన్న అనేక హాస్టళ్లకు మూసివేత తప్ప మరో మార్గం కనిపించడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. హాస్టళ్లు మూతపడితే విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులు నగరం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చని భయపడుతున్నారు.
యుద్ధ ప్రభావం… మెనూ తగ్గింపు
ఇరాన్‌పై అమెరికా యుద్ధ పరిస్థితుల ప్రభావం కూడా గ్యాస్ సరఫరాపై పడిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. చమురు, గ్యాస్ దిగుమతులు తగ్గిపోవడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఇప్పటికే బెంగళూరు, ముంబై నగరాల్లో అనేక హోటళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు అదే పరిస్థితి హైదరాబాద్‌లో కనిపిస్తోంది. గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండే బిర్యానీ, మాంసాహార వంటకాలను కొన్ని హోటళ్లు నిలిపివేశాయి. కొన్ని చోట్ల “ఈ వంటకాలు అందుబాటులో లేవు” అంటూ మెనూలు ప్రదర్శిస్తున్నారు.
గ్యాస్ కొరతతో టిఫిన్లు, భోజనాల ధరలు కూడా పెరుగుతున్నాయి. మీల్స్‌పై సుమారు రూ.15 వరకు, ఇడ్లీ, ఉప్మా వంటి వంటకాలపై రూ.10 వరకు పెరుగుదల కనిపిస్తోంది. రెస్టారెంట్లు సైతం సుమారు 15 శాతం వరకు ధరలు పెంచినట్లు సమాచారం. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లకు కూడా ఆర్డర్లు తగ్గినట్లు డెలివరీ సిబ్బంది చెబుతున్నారు.
హాస్టళ్లు మూత… నిరుద్యోగులకు కష్టాలు
నగరంలోని అశోక్‌నగర్, అమీర్‌పేట్, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉన్న హాస్టళ్లు గ్యాస్ కొరతతో మూసివేయడానికి సిద్ధమవుతున్నాయి. సుమారు 11 వేల హోటళ్లు కూడా తాళం వేసే పరిస్థితి ఉందని తెలుస్తోంది. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అశోక్‌నగర్‌కు చెందిన హాస్టల్ నిర్వాహకుడు రవి మాట్లాడుతూ రోజుకు మూడు గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తామని, ప్రస్తుతం గ్యాస్ అందకపోవడంతో హాస్టల్ నిర్వహించడం కష్టమైందని తెలిపారు.
ఇండక్షన్ స్టౌలకు పెరిగిన డిమాండ్
గ్యాస్ కొరత కారణంగా చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్తుతో పనిచేసే ఇండక్షన్ స్టౌలు, ఎలక్ట్రిక్ కుక్కర్లు, స్మార్ట్ కుక్కర్లకు డిమాండ్ పెరిగింది. హోమ్ అప్లయెన్సెస్ దుకాణాల్లో భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. డిమార్ట్, ఇతర సూపర్మార్కెట్లు కూడా పెద్ద ఎత్తున స్టాక్ తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వీటి ధరలు కూడా పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.
గ్యాస్ సిలిండర్ల కోసం క్యూలు
ఇక గ్యాస్ సిలిండర్ల కొరత గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని ఒక గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది. క్యూలో నిలబడిన ఒక వృద్ధురాలు పడిపోవడంతో గాయాలయ్యాయి. కొందరు వినియోగదారులు సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని ఆరోపణలు చేశారు. అయితే ఏజెన్సీ డీలర్ మాత్రం రోజు విడిచి రోజు 342 సిలిండర్లు వస్తున్నాయని, మొత్తం 18 వేల కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు.
ప్రభుత్వ సూచనలు
గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందవద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సూచించింది. వినియోగదారులు అవసరానికి మించిన సిలిండర్లను ఓవర్ బుకింగ్ చేయకూడదని కోరింది. బుకింగ్ సమస్యలు లేదా గ్యాస్ అక్రమ రవాణా కనిపిస్తే 1967 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది. ఇటీవల నిర్వహించిన దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న 100 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
