Jagruthi Kavitha: తెలంగాణ రాజకీయాల్లో తాజాగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కేసీఆర్ కుమార్తె కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం వద్ద పార్టీ నమోదు ప్రక్రియ కొనసాగుతోందని ఆమె తెలిపారు. మే నెలలో అధికారికంగా పార్టీని ప్రకటించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ప్రజల సూచనల ఆధారంగా పార్టీ పేరును నిర్ణయిస్తామని కవిత వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని కవిత స్పష్టం చేశారు. తనకు మొదటి ప్రాధాన్యత సిద్ధిపేట నియోజకవర్గం కాగా, రెండో ప్రాధాన్యత బోధన్ అని చెప్పారు. “సామాజిక తెలంగాణ” నిర్మాణమే తన లక్ష్యమని పేర్కొంటూ, 2029 ఎన్నికల్లో ఈ రెండు ప్రాంతాల్లో పోటీ చేసే అవకాశాలపై సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల వరకు తమ పార్టీనే ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తుందని కూడా వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభావం తగ్గిపోతుందని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి.
ఇక కవిత తాజా వ్యాఖ్యలు, చర్యలు గమనిస్తే బీఆర్ఎస్‌ను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని రాజకీయ వ్యూహాలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేటపై ఆమె ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు స్పష్టమవుతోంది. సిద్ధిపేట ఎవరి వ్యక్తిగత జాగీరు కాదని, దాన్ని ప్రైవేట్ ప్రాపర్టీలా మార్చుకున్నారని గతంలోనే విమర్శించిన కవిత, ఇప్పుడు అక్కడి నుంచే పోటీ చేయాలనే సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తోంది.
కేసీఆర్ కుమార్తెగా సిద్ధిపేటలో సెంటిమెంట్ తనకు అనుకూలంగా పనిచేస్తుందని ఆమె వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో హరీష్ రావు పై యాంటీ-ఇంకంబెన్సీ ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద స్పష్టమైన వ్యూహంతో కవిత ముందుకు సాగుతున్నారని కనిపిస్తోంది. కొత్త పార్టీ ప్రకటన అనంతరం తన పూర్తి రాజకీయ కార్యాచరణ, భవిష్యత్ లక్ష్యాలపై మరింత క్లారిటీ ఇస్తానని ఆమె సూచించారు.
