Crime: దారుణం.. ప్రేమ పెళ్లి చేస్కోని.. 8 నెలలకే కడతేర్చిన భర్త

Husband Allegedly Murders Wife at Mahabub nagar dist

Husband Allegedly Murders Wife at Mahabub nagar dist

Crime: మహబూబ్‌నగర్ జిల్లాలో భార్యను భర్త హత్య చేసిన దారుణ ఘటన కలకలం రేపింది. జీవితాంతం కలిసి ఉంటానని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కేవలం ఎనిమిది నెలలకే కిరాతకంగా చంపడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన శ్రీదేవి (21) నర్సింగ్ పూర్తి చేసింది. అదే గ్రామానికి చెందిన డ్రైవర్ చందుతో ఆమె ప్రేమలో పడి, కుటుంబ సభ్యులను ఎదిరించి ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకుంది. అయితే పెళ్లి అయిన కొద్దికాలానికే చందు మద్యం తాగి వచ్చి ప్రతిరోజూ ఆమెను వేధించడం ప్రారంభించాడు. తనవాళ్లను వదిలి వచ్చిన శ్రీదేవి ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేక మౌనంగా భరించింది.

ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో కోపంతో చందు శ్రీదేవి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఈ ఘటనను ఆత్మహత్యగా చూపించేందుకు మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి పొలం వద్దకు తీసుకెళ్లాడు.

తర్వాత తన సోదరుడికి ఫోన్ చేసి, శ్రీదేవి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకునేలోపు చందు పరారయ్యాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు.

శవపరీక్షలో ఇది హత్య అని తేలడంతో శనివారం ఉదయం మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. ఈ సమయంలో నిందితుడిని పట్టుకునే వరకు అంత్యక్రియలు నిర్వహించమని మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని వారిని సముదాయించి అంత్యక్రియలు జరిపించారు.

ఇక నిందితుడు చందు పోలీసుల ఎదుట లొంగిపోయి తన నేరాన్ని అంగీకరించినట్లు ఎస్సై వేణు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వస్తాయని పోలీసులు వెల్లడించారు.

Also Read: Andhra Pradesh: భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

Crime: దారుణం.. ప్రేమ పెళ్లి చేస్కోని.. 8 నెలలకే కడతేర్చిన భర్త