Alluri: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్ట వద్ద ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు సహా 35 మంది యాత్రికులు ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో తొలుత 9 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనా స్థలానికి చింతూరు పోలీసులు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరం వెళ్లే దారిలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బస్సులో ప్రయాణించినవారు చిత్తూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాద స్థలం కఠినమైన ఘాట్ రోడ్డు కావడంతో రక్షణ చర్యలు కాస్త మందగిస్తున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
ప్రమాదంపై సీఎం చంద్రబాబు స్పందన
ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడిపోవడంతో యాత్రికులు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. గాయపడిన వారిని వెంటనే చింతూరు ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు సీఎం కు వివరించారు. ఉన్నతాధికారులు తక్షణమే సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. బాధితులకు అవసరమైన మెరుగైన వైద్యం అందేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది: మంత్రి నారా లోకేశ్
ప్రమాదంపై ఐటీ మంత్రి నారా లోకేశ్ కూడా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. యాత్రికులు దుర్మరణం చెందడం హృదయవిదారకం అని తెలిపారు. గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
క్షతగాత్రుల చికిత్సపై దృష్టి పెట్టాలి: హోంమంత్రి అనిత
హోంమంత్రి అనిత కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పోలీసులు అందించిన వివరాలను సేకరించి, గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందేలా చూడాలని ఆమె సూచించారు.

