BREAKING: అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఈ రెండు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువగా చెల్లిస్తున్నాయని అధికారులు గుర్తించారు. దీనిపై నవంబర్ 21న అధికారిక నోటీసులు పంపించారు. వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపించి భారీగా పన్ను ఎగవేస్తున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది.
అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) మొత్తం 1,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, కేవలం 8,100 చదరపు అడుగులు మాత్రమే చూపించినట్లు అధికారులు తెలిపారు. దీంతో చెల్లించాల్సిన రూ. 11,52,000 బదులుగా కేవలం రూ. 49,000 మాత్రమే చెల్లిస్తున్నారని వెల్లడించారు.
అదే విధంగా రామానాయుడు స్టూడియోస్ (Ramanaidu Studios) 68,000 చదరపు అడుగులు ఉపయోగిస్తున్నప్పటికీ, కేవలం 1,900 చదరపు అడుగులకు మాత్రమే పన్ను చెల్లిస్తున్నట్లు తేలింది. వీరు చెల్లించాల్సిన రూ. 2,73,000 బదులుగా కేవలం రూ. 7,600 మాత్రమే చెల్లిస్తున్నారని అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి ట్రేడ్ లైసెన్స్ ఫీజు వెంటనే చెల్లించాలని హెచ్చరికలు జారీ చేస్తూ, జూబ్లీహిల్స్ సర్కిల్ అధికారులు ఈ రెండు స్టూడియోలకూ నోటీసులు అందించారు.
