Liquor Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. కవితపై మోపిన ఆరోపణలను కోర్టు తోసిపుచ్చుతూ, ఆమెకు పూర్తిస్థాయిలో క్లీన్చిట్ ఇచ్చింది.
కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆమె ఆడిటర్ బుచ్చిబాబు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీష్ సిసోడియా సహా మరో 20 మందిపై కూడా సరైన సాక్ష్యాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. చార్జ్‌షీట్‌లో కూడా లోపాలు ఉన్నాయని పేర్కొంది. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేందర్ సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలను నిరూపించడంలో దర్యాప్తు సంస్థ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది.
రెండేళ్లకు పైగా సాగిన ఈ కేసులో కవిత అరెస్టై జైలుకు వెళ్లి, అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఇప్పుడు కేసు పూర్తిగా కొట్టివేయబడటంతో ఆమెకు, అలాగే బీఆర్ఎస్ శ్రేణులకు పెద్ద ఎత్తున ఊరట లభించింది.
కేసు నేపథ్యం:
2021-22 ఆర్థిక సంవత్సరానికి ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేసింది. ఈ విధానంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. 2022 జూలైలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు ఆదేశించారు. లైసెన్స్ ఫీజు మాఫీ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లిందని అప్పటి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నివేదిక సమర్పించారు.
మద్యం వ్యాపారులకు లాభం చేకూరేలా పాలసీ రూపొందించారని, దానికి ప్రతిఫలంగా ఆప్ నాయకులకు కోట్ల రూపాయల ముడుపులు అందాయని సీబీఐ ఆరోపించింది. ‘సౌత్ గ్రూప్’ పేరిట కొందరు వ్యాపారులు, రాజకీయ నాయకులు కలిసి సుమారు రూ.100 కోట్ల వరకు కిక్‌బ్యాక్‌లు చెల్లించారని దర్యాప్తులో పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ఈ కేసులో 2023 ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను, 2024 మార్చి 15న కల్వకుంట్ల కవితను, మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం వారంతా బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా తుది విచారణ అనంతరం కోర్టు కవితతో పాటు మొత్తం 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ క్లీన్చిట్ ఇచ్చింది.
BREAKING లిక్కర్ స్కామ్ కేసులో కవితకు క్లీన్ చిట్