- వెల్నెస్ బ్రాండ్ హైట్స్ సహ-వ్యవస్థాపకుడు డాన్ ముర్రే పోస్ట్ వైరల్
- డ్యూటీ అయిపోగానే ఆఫీస్ నుంచి వెళ్లిపోవాలని ఉద్యోగులకు సూచన
- ఎక్కువ గంటల పనితో గుండె జబ్బులు, మానసిక ఆందోళన కలుగుతుందని వార్నింగ్
- గరిష్ట స్థాయికి చేరిన ఒత్తిడి ఆత్మహత్యకు ప్రేరేపిస్తుందని వెల్లడి
Life: వారానికి 70 గంటలు చొప్పున పని చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి… కాదు, వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారం సెలవునూ వదిలేయాలని ఎల్ అండ్ టీ సీఎండీ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ వంటి వారు చెప్తుటే బ్రిటిష్ వ్యాపారవేత్త, వెల్నెస్ బ్రాండ్ హైట్స్ సహ-వ్యవస్థాపకుడు డాన్ ముర్రే మాత్రం వీరికి భిన్నంగా స్పందించారు.
ఉద్యోగులు పని కోసం ఆరోగ్యాన్ని త్యాగం చేయవద్దని సూచించారు. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ప్రయాణాలు చేయాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని చెప్పారు. ఉద్యోగులు అతిగా పనిచేయడం ప్రమాదమని..డ్యూటీ అయిపోగానే ఆఫీస్‌ను వదిలి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులను ఉద్దేశించి లింక్డ్‌ఇన్ లో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అయింది.
ఎక్కువ గంటలు డ్యూటీ చేస్తే..!
డ్యూటీ అయిపోగానే ఆఫీస్‌ను ఎందుకు వదిలి వెళ్లిపోవాలో డాన్ ముర్రే తన పోస్టులో కారణాలను చాలా స్పష్టంగా వివరించారు. ఉద్యోగులకు పని ఎప్పటికీ అంతం కాని ప్రక్రియని..కానీ, వారికి టైం, హెల్త్ చాలా పరిమితమైనవని, అంతకు మించి చాలా విలువైనవని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఎక్కువ గంటలు పనిచేసే ఉద్యోగులకు గుండె జబ్బులు, స్ట్రోక్, మానసిక ఆందోళన, జీవితంపై అసంతృప్తి వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలొస్తాయన్నారు.
అంతేగాక వ్యక్తిగత సంబంధాలు సన్నగిల్లుతాయని, కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపే క్షణాలను మిస్ అవుతారని వెల్లడించారు. దీనివల్ల ఉద్యోగులు ఉల్లాసాన్ని, క్రియోటివిటీని, తమ నైపుణ్యాలను కోల్పోతారని తెలిపారు. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకునే శక్తి వారికి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితం ఒక చట్రంలా అనిపిస్తుందని..ప్రతీదానికి బౌండరీ పెట్టుకునే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఒత్తిడి సంబంధిత వ్యాధులు గరిష్ట స్థాయికి చేరుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపిస్తాయని వెల్లడించారు. ఉద్యోగం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమేనని..అదెప్పటికీ మన జీవితం మొత్తానికి గుర్తింపు కాదన్నారు.
డ్యూటీ అయిపోగానే ఆఫీస్ వదిలితే..!
డ్యూటీ అయిపోగానే ఆఫీస్‌ను వదిలి వెళ్లిపోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని డాన్ ముర్రే అభిప్రాయపడ్డారు. ఆఫీస్ నుంచి త్వరగా వెళ్లిపోవడం ద్వారా ఉద్యోగులు తమ అవసరాలకు సరిహద్దులను నిర్ణయించుకోవచ్చన్నారు. తద్వారా తమ శరీరాన్ని, మనసును, శక్తిని రీఛార్జ్ చేసుకోవచ్చన్నారు. ఇది ఉద్యోగంలో మెరుగైన టీమ్ సభ్యులుగా మారేందుకు సహకరిస్తుందని స్పష్టం చేశారు. ఆఫీస్ బయట ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే ఆఫీసులో డ్యూటీ బాగా చేస్తారని వివరించారు.
ఇష్టమైనవారితో సమయం గడపటం, నచ్చిన చోటుకు వెళ్లడం, తినడం అనేవి వెలకట్టలేనివని వాటిని ఎప్పటికీ మిస్ చేసుకోవద్దని ఉద్యోగులకు డాన్ ముర్రే సూచించారు. మానసిక, శారీరక ఆరోగ్యం కోసం మంచి జీవనశైలిని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. డాన్ ముర్రే చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ పోస్ట్‌కు వేలాది లైక్‌లు, షేర్‌లతో విశేష స్పందన లభించింది. వివిధ రంగాల్లోని ప్రొఫెషనల్స్ తమ సొంత బర్న్‌అవుట్ కథలను, రికవరీ అనుభవాలను పంచుకున్నారు.
– Palnati Mahesh(Journalist)
