Ashna Thampi: అకౌంట్‌లో ₹44, చేతిలో ₹40.. బరిలో 26ఏళ్ల అమ్మాయి!

Rs 40 In Hand, Rs 44 In Bank: Is This Journalist Kerala's Poorest Election Candidate?

Rs 40 In Hand, Rs 44 In Bank: Is This Journalist Kerala's Poorest Election Candidate?

Ashna Thampi: ప్రస్తుతం రాజకీయాల్లో కోట్లు ఖర్చు చేసే స్థోమత ఉన్నవారే పోటీ చేయగలరనే భావన నెలకొంది. అయితే అలాంటి పరిస్థితుల్లో కేవలం రూ.84 ఆస్తులతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన కేరళ యువతి ఆశ్నా తంపి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) పార్టీకి చెందిన 26 ఏళ్ల ఆశ్నా తంపి ఎట్టుమానూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఆమె ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో తన వద్ద మొత్తం రూ.84 మాత్రమే ఆస్తి ఉందని వెల్లడించింది. అందులో రూ.40 నగదు, బ్యాంకు ఖాతాలో రూ.44 ఉన్నాయని తెలిపింది. తన పేరుపై ఇల్లు, భూమి, వాహనం వంటి ఎలాంటి ఆస్తులు లేవని స్పష్టంగా పేర్కొంది.

కోట్లాది రూపాయల ఆస్తులు చూపించే అభ్యర్థుల మధ్య, ఆశ్నా వెల్లడించిన ఈ సాధారణ ఆస్తి వివరాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఆమె లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేయడంతో పాటు జర్నలిజంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా చేసింది. ఆర్థికంగా వెనుకబడినప్పటికీ, సామాజిక సమస్యలపై మంచి అవగాహన కలిగి ఉంది.

ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (AIDSO) ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆశ్నా, సాధారణ ప్రజల సమస్యల కోసం ఇప్పటికే పలు పోరాటాలు చేసింది. ఒకసారి ఆశా వర్కర్ల హక్కుల కోసం నిరసన తెలుపుతూ తన జుట్టును కత్తిరించుకుని ప్రత్యేకంగా నిరసన తెలిపింది.

ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె విభిన్నంగా ముందుకు సాగుతోంది. భారీ ఖర్చులతో ర్యాలీలు నిర్వహించకుండా, ప్రజల నుంచి చిన్నచిన్న విరాళాలు సేకరించి ప్రచారం చేస్తోంది. స్థానికులు, పార్టీ కార్యకర్తలు రూ.10 నుంచి రూ.50 వరకు ఇచ్చే విరాళాలతో పోస్టర్లు, పాంప్లెట్లు ముద్రించి తన అజెండాను ప్రజలకు తెలియజేస్తోంది. స్వయంగా ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలుస్తోంది.

ఆమె ఎన్నికల అజెండాలో స్థానిక సమస్యలకే ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా కోటయం మెడికల్ కాలేజీలో వైద్యుల కొరత, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, తాగునీటి ఇబ్బందులను పరిష్కరించడంపై దృష్టి సారిస్తోంది. డబ్బు కంటే ప్రజల సమస్యలే ముఖ్యమని ఆశ్నా తంపి విశ్వసిస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తోంది.

Also Read: Cancer: నైట్‌ షిఫ్టులతో క్యాన్సర్ ముప్పు

Ashna Thampi: అకౌంట్‌లో ₹44, చేతిలో ₹40.. బరిలో 26ఏళ్ల అమ్మాయి!