Divorce: కూతురి విడాకులు.. గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన తల్లిదండ్రులు

Meerut Family Celebrates Daughter’s Divorce With Grand Welcome After Ending 7-Year Marriage To Army Officer

Meerut Family Celebrates Daughter’s Divorce With Grand Welcome After Ending 7-Year Marriage To Army Officer

Divorce: ఇటీవలి కాలంలో పెళ్లి అనే పవిత్ర బంధం విలువ తగ్గిపోతుందనే అభిప్రాయం చాలా మందిలో కనిపిస్తోంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా, ప్రేమ పెళ్లి అయినా కొద్ది కాలానికే చిన్న చిన్న విషయాలకే గొడవలు పెరిగి విడాకుల వరకు వెళ్లే పరిస్థితులు పెరుగుతున్నాయి. కొంతమంది అయితే ఆర్థిక సమస్యలు, వివాహేతర సంబంధాలు లేదా వ్యక్తిగత విభేదాల కారణంగా హత్యలు, ఆత్మహత్యలు వంటి తీవ్ర నిర్ణయాలకు కూడా దిగుతున్నారు. మరికొందరు చిన్న కారణాలకే భాగస్వామిని మానసికంగా వేధిస్తూ జీవితాన్ని నరకంగా మార్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

యూపీకి చెందిన రిటైర్డ్ జడ్జి జ్ఞానేంద్ర శర్మ తన ఏకైక కూతురికి 2018 డిసెంబర్ 14న ఆర్మీ మేజర్‌తో ఘనంగా వివాహం జరిపించారు. ఒక్కగానొక్క కుమార్తె కావడంతో కట్నం, కానుకలు కూడా బాగా ఇచ్చారు. పెళ్లి తర్వాత కొంతకాలం అంతా బాగానే ఉన్నప్పటికీ, తరువాత భర్త మరియు అత్తింటి వారు ఆమెను వేధించడం ప్రారంభించారు. రోజువారీగా ఎదురైన ఈ వేధింపులను తట్టుకోలేక ఆ యువతి చివరకు తన పుట్టింటికి వెళ్లిపోయింది.

తర్వాత ఆమె ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేసింది. ఈ కేసు దాదాపు ఎనిమిదేళ్ల పాటు కోర్టులో కొనసాగింది. చివరకు 2026 ఏప్రిల్ 4న కోర్టు వీరికి విడాకులు మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఎన్నేళ్లుగా అనుభవించిన బాధల నుంచి తన కూతురు విముక్తి పొందిందని భావించిన తండ్రి, ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలని నిర్ణయించారు.

విడాకులు వచ్చిన ఆనందంలో, “I Love You” అని ప్రింట్ చేసిన టీషర్ట్ వేసుకుని, డీజేలు, డ్యాన్స్‌లతో తన కూతురిని ఇంటికి తీసుకువచ్చి గ్రాండ్‌గా సెలబ్రేషన్ నిర్వహించారు. బంధువులు, స్నేహితులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు తండ్రి ప్రేమను ప్రశంసిస్తుంటే, మరికొందరు ఒక జడ్జి కూతురికీ ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయంటే ఆశ్చర్యపోతున్నారు. ఇంకొందరు విడాకులను ఇలా జరుపుకోవడం సరైందేనా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ సంఘటన పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

Also Read: High Court: ‘ఆ అర్చకులకు గర్భాలయంలోకి ఎంట్రీ లేదు’

Divorce: కూతురి విడాకులు.. గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన తల్లిదండ్రులు