Monaliasa Wedding: ‘ఇది లవ్ జిహాద్’.. మోనాలిసా పెళ్లిపై కాంట్రవర్శియల్ కామెంట్స్

Kumbh Viral Girl Monalisa Marries Farman Khan in Kerala

Kumbh Viral Girl Monalisa Marries Farman Khan in Kerala

Monaliasa Wedding: మహా కుంభమేళా సమయంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన యువతి మోనాలిసా ఇటీవల తన ప్రేమికుడు ఫర్మాన్ ఖాస్‌ను కేరళలో వివాహం చేసుకోవడం వివాదానికి దారితీసింది. వైరల్ అయిన తర్వాత ఆమెకు సినీ అవకాశాలు కల్పించిన దర్శకుడు సనోజ్ మిశ్రా ఈ పెళ్లిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు.

మోనాలిసా ముందుగా పోలీసుల భద్రత మధ్య కేరళలో సివిల్ మ్యారేజ్ చేసుకుని, అనంతరం ఆలయంలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఆమెను సినీ రంగంలోకి తీసుకువచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రాను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

సనోజ్ మిశ్రా సోషల్ మీడియాలో చేసిన పోస్టులో ఈ వివాహంపై తీవ్ర విమర్శలు చేశారు. మోనాలిసా ప్రేమతో కాకుండా ప్రలోభాలకు లోనై పెళ్లి చేసుకుందని, ఇది “లవ్ జిహాద్”లో భాగమని ఆయన ఆరోపించారు. ఆమెను మోసం చేసి ఈ వివాహం జరిగిందని కూడా పేర్కొన్నారు. తానే మోనాలిసాకు శిక్షణ ఇచ్చి ఆమెను సినీ రంగంలోకి తీసుకువచ్చానని, కానీ ప్రస్తుతం జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని అన్నారు.

మహా కుంభమేళా సమయంలో వైరల్ అయిన తర్వాత అడవుల్లో జీవించే ఒక సాధారణ అమ్మాయిని గుర్తించి, ఆమెకు నటనలో శిక్షణ ఇచ్చి సినీ నటిగా చేయాలని ప్రకటించానని ఆయన తెలిపారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా దీనికి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. అయితే కొందరు తప్పుడు ఆరోపణలు చేసి తనను జైలుకు పంపించారని కూడా ఆరోపించారు.

జైలులో ఉన్న సమయంలోనే సినిమా కథ రాశానని, బయటకు వచ్చిన తర్వాత సినిమా పూర్తి చేశానని సనోజ్ చెప్పారు. మోనాలిసాను తాను ఎంతో గౌరవంగా చూసానని, ఆమెను గంగా మాత అవతారంగా భావించానని కూడా పేర్కొన్నారు.

అలాగే మోనాలిసా కుటుంబ పరిస్థితుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. చిన్నప్పటి నుంచి ఆమె జీవితం సులభంగా లేదని, కుటుంబ సమస్యల వల్ల ఎంతో బాధపడేదని చెప్పారు. తన నిజమైన తల్లి గురించి ఆమె తరచూ బాధపడేదని, ఒకరోజు అవకాశం దొరికితే ఆమె దగ్గరకు వెళ్లాలని అనుకునేదని తెలిపిందని చెప్పారు.

మోనాలిసా తాజా నిర్ణయం ఆమెకు తిరుగుబాటుగా అనిపించవచ్చని, కానీ వాస్తవానికి ఇది “లవ్ జిహాద్” కేసు కావచ్చని సనోజ్ మిశ్రా ఆరోపించారు. అంతేకాదు, తన వద్ద పనిచేసిన ఒక వ్యక్తి తర్వాత ఆమెను తప్పుదోవ పట్టించి దక్షిణ భారతదేశంలో ఒప్పందాలు చేసుకున్నాడని కూడా ఆయన ఆరోపించారు.

ఈ వివాదంపై మోనాలిసా లేదా ఆమె భర్త నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు. అయితే ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.

Also Read: LPG Crisis: గ్యాస్ ఏజెన్సీల ముందు ‘నో స్టాక్’ బోర్డులు

Monaliasa Wedding: ‘ఇది లవ్ జిహాద్’.. మోనాలిసా పెళ్లిపై కాంట్రవర్శియల్ కామెంట్స్