Court: భారతదేశంలో గౌరవ సూచకంగా ఉపయోగించే “ఆంటీ” అనే పదం, బ్రిటన్‌లో మాత్రం సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా కార్యాలయాల్లో ఈ పదాన్ని వయస్సు, లింగానికి సంబంధించిన వేధింపుగా పరిగణించే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన హెల్త్‌కేర్ అసిస్టెంట్ ఇల్డా ఎస్టెవ్స్ (64) కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమ లండన్‌లోని ఒక NHS ట్రస్ట్‌లో పనిచేస్తున్న ఆమెకు, సహోద్యోగి ప్రవర్తన వల్ల మనోవేదన కలిగిందని ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యునల్ గుర్తించింది. దీంతో ట్రిబ్యునల్ జడ్జి ఇలియట్, ఆ సంస్థ ఇల్డాకు £1,425 (సుమారు రూ.1.8 లక్షలు) నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు.
కేసు వివరాల ప్రకారం, ఘనా దేశానికి చెందిన నర్సు చార్లెస్ ఒప్పోంగ్, ఇల్డాను పని ప్రదేశంలో పదేపదే “ఆంటీ” అని పిలిచేవాడు. ఇల్డా దీనిపై పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, అతను అదే విధంగా కొనసాగించాడు. జూన్ 2023లో, 61 ఏళ్ల జార్జ్ అనే వృద్ధ ఉద్యోగికి ఇల్డా సరైన భాగస్వామి అవుతారని సూచించడం కూడా వివాదానికి దారితీసింది.
ట్రిబ్యునల్ విచారణలో ఒప్పోంగ్ అన్ని ఆరోపణలను ఖండించినప్పటికీ, కనీసం ఒకసారి “ఆంటీ” అని పిలిచినట్లు అంగీకరించాడు. ఘనా సంస్కృతిలో ఈ పదం పెద్దలను గౌరవంగా సంబోధించడానికి ఉపయోగిస్తారని చెప్పినా, ఇల్డాకు అది అసౌకర్యంగా అనిపించిందని న్యాయమూర్తి గుర్తించారు.
ఈ విషయంపై న్యాయమూర్తి ఇలియట్ మాట్లాడుతూ, “ఇలాంటి వ్యాఖ్యలు మంచి ప్రవర్తన కాదు. పని ప్రదేశంలో ఇవి ఆ వ్యక్తిని బాధపెట్టాయి. ఇది వయస్సు, లింగానికి సంబంధించిన వేధింపుగా పరిగణించబడుతుంది” అని వ్యాఖ్యానించారు.
ఇల్డా తన వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచాలని కోరినా, ట్రిబ్యునల్ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. అయితే ఆమెపై జరిగిన వేధింపుల అంశాన్ని మాత్రం సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.
