LPG Shortage: భవిష్యత్తులో జరిగే విషయాలను జ్యోతిష్యులు ముందుగానే అంచనా వేస్తుంటారు. అయితే ఆ అంచనాల్లో కొన్ని నిజమవుతాయి. మరికొన్ని అటుఇటుగా ఉండొచ్చు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ట్వీట్ చూసినప్పుడు మాత్రం ఆ అంచనా ఎంత కచ్చితంగా ఉందో అనిపించే పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ప్రభావం పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో భారత్‌లో కూడా కమర్షియల్ ఎల్పీజీ (LPG) సరఫరాలో కొంత అస్థిరత కనిపిస్తోందని పలు నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఒక జ్యోతిష్యుడు చేసిన అంచనా ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
జ్యోతిష్కుడు ప్రశాంత్ కిన్నీ 2025 సెప్టెంబర్ నెలలో సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్) లో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో 2026 మార్చి తర్వాత భారత్‌లో పెట్రోలియం, సహజ వాయువు సరఫరాలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థలో అంతరాయం కలగవచ్చని ఆయన అప్పట్లోనే హెచ్చరించారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ సరఫరా సమస్యలపై వార్తలు వస్తుండటంతో ఆయన చేసిన ఆ పాత ట్వీట్ మళ్లీ వైరల్ అవుతోంది.
ఇటీవల ప్రశాంత్ కిన్నీ అదే ట్వీట్‌ను తిరిగి షేర్ చేస్తూ, “ఈ అంచనాను నేను దాదాపు ఐదు నెలల క్రితమే చెప్పాను” అని పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం పెద్ద చర్చకు దారి తీసింది. కొంతమంది ఇది కేవలం యాదృచ్ఛికమని అభిప్రాయపడుతుండగా, మరికొందరు జ్యోతిష్య అంచనా నిజమవుతుందేమోనని కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా యుద్ధ ప్రభావంతో కొన్ని నగరాల్లో ఎల్పీజీ సరఫరా సమస్యలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆలస్యంగా జరుగుతోందని హోటల్ సంఘాలు పేర్కొంటున్నాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు కొంత ఇబ్బంది పడుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ఈ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. అవసరమైన సేవలకు గ్యాస్ సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం గృహ వినియోగ సిలిండర్లకు ప్రాధాన్యం ఇచ్చారు. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ బుకింగ్ మధ్య వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచారు. రిఫైనరీలకు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యలతో త్వరలో సరఫరా పరిస్థితి స్థిరపడుతుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది.
India will face fuel and natural Gas shortage after March 2026…
Supply chain disrupt…!!??— Prashanth Kini (@AstroPrashanth9) September 27, 2025
