Water Heater: చలికాలం మొదలైతే చల్లని నీటితో ముఖం కడుక్కోవడం కూడా కష్టమవుతుంది. అలాంటి వేళ వేడి నీటితో స్నానం చేస్తే కలిగే హాయీ వేరు. కానీ ఆ వేడి నీటిని సిద్ధం చేసుకునే విధానం మాత్రం ఒక్కో ఇంట్లో ఒక్కోలా ఉంటుంది. కొందరు గీజర్ వాడుతుంటే, మరికొందరు గ్యాస్ స్టౌ లేదా వాటర్ హీటర్ వాడుతుంటారు.
వీటిలో ఎక్కువ ఇళ్లలో కనిపించేది మాత్రం వాటర్ హీటర్. ధర తక్కువగా ఉండడం, నీళ్లు వేడి కావడం త్వరగా జరగడం వల్ల అందరూ దీనిని ఇష్టపడుతున్నారు. కానీ దీన్ని వాడేటప్పుడు చిన్న నిర్లక్ష్యం ప్రాణాపాయానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
కొనేటప్పుడు జాగ్రత్త:
మార్కెట్‌లో ఏ హీటర్ అయినా కాకుండా ISI మార్క్ ఉన్న, నమ్మకమైన బ్రాండ్‌ల ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలి. హీటర్ కాయిల్స్ మీద ఉండే సిలికా కోటింగ్ రెండు సంవత్సరాల తర్వాత తొలగిపోతుంది కాబట్టి అప్పుడు కొత్తది తీసుకోవాలి.
బకెట్ ఎంపికలో జాగ్రత్త:
కొంతమంది ప్లాస్టిక్ బకెట్‌లో నేరుగా హీటర్ పెడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. వేడి కారణంగా ప్లాస్టిక్ కరుగుతూ విద్యుత్ ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ బకెట్‌లో వేయాల్సి వస్తే, ముందుగా ఒక చెక్క పలకపై హీటర్ ఉంచి ఉపయోగించాలి. అల్యూమినియం బకెట్‌లో అయితే నేరుగా పెట్టవచ్చు కానీ ఇనుప బకెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.
హీటర్ ఉపయోగించే ముందు బకెట్‌లో నీరు 90 శాతానికి పైగా నింపాలి. కాయిల్ పూర్తిగా నీటిలో మునిగేలా చూసి తర్వాతే ప్లగ్ కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేయాలి.
నిర్లక్ష్యం ప్రాణాంతకం:
నీళ్లు వేడయ్యాయా అని చూడటానికి స్విచ్ ఆన్ ఉన్నప్పుడు చేతితో తాకకూడదు. ముందుగా స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసి తర్వాతే చెక్ చేయాలి. అదేవిధంగా నీళ్లు మరుగేంతవరకు ఎక్కువసేపు హీటర్ ఆన్ చేయడం మంచిది కాదు.
కొంతమంది హీటర్‌ను బాత్‌రూమ్‌లో నేరుగా ఉపయోగిస్తారు, ఇది చాలా ప్రమాదకరం. తేమ కారణంగా షాక్ తగిలే అవకాశం ఉంటుంది. అలాగే నీరు లేకుండానే హీటర్ ఆన్ చేస్తే కాయిల్ మండిపోతుంది, దాన్ని తాకితే ప్రాణాంతక ప్రమాదం తథ్యం.
చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో హీటర్‌ను ఎప్పుడూ వారి చేరుకోలేని ప్రదేశంలో ఉంచాలి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను తప్పించి సురక్షితంగా చలికాలాన్ని ఆస్వాదించవచ్చు.
