Phone: తల్లిదండ్రులు తమ పనుల్లో ఉండగా లేదా పిల్లలు ఏడిస్తే వారిని బుజ్జగించేందుకు చాలామంది స్మార్ట్‌ఫోన్లలో కార్టూన్లు చూపించడం అలవాటు చేసుకున్నారు. కానీ ఈ అలవాటు పిల్లలకు మేలు చేయకుండా శాపంగా మారుతోంది. చిన్నారులు క్రమంగా ఫోన్‌కు బానిసలై కంటి సమస్యలు, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సౌరాష్ట్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగం చేసిన అధ్యయనంలో 54 శాతం తల్లులు పనుల కోసం పిల్లలకు ఫోన్ ఇస్తున్నారని, 70 శాతం పిల్లలు భోజనం చేస్తూనే వీడియోలు చూస్తున్నారని తేలింది. ఫోన్ ఇవ్వనప్పుడు పిల్లలు మొండికేస్తూ సాధించుకుంటున్నారని కూడా గుర్తించారు.
అతిగా చేస్తే ఏదైనా అనర్థమే. గంటల తరబడి రీల్స్ చూడటం వల్ల పిల్లల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. చేతి వేళ్లకు, మెదడుకు ఉన్న అనుసంధానం క్షీణిస్తోంది. ఆటపాటల నుండి దూరమై సృజనాత్మకత తగ్గిపోతోంది. తోటి పిల్లలతో స్నేహం తగ్గిపోవడంతో మానవ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి.
నిపుణుల సూచన ప్రకారం ఐదేళ్లలోపు పిల్లలకు ఫోన్ ఇవ్వకూడదు. అయితే ప్రస్తుతం ఏడాది పిల్లలకే ఫోన్ అలవాటు అవుతోంది. అత్యవసరమైతే తప్ప ఫోన్ వినియోగం నివారించాలని వైద్యులు చెబుతున్నారు.
తల్లిదండ్రులు చేయాల్సింది:
-
ముందుగా తల్లిదండ్రులే తమ స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించాలి.
-
పిల్లల దృష్టిని ఆరుబయట ఆటల వైపు మళ్లించాలి.
-
బొమ్మలు వేయడం, పజిల్స్, చెస్, క్యారమ్స్ లాంటి ఆటలకు అలవాటు చేయాలి.
-
వారంలో కనీసం రెండు మూడు రోజులు కథలు చెప్పే అలవాటు పెట్టాలి.
-
సెలవు రోజుల్లో ఫోన్ పక్కన పెట్టి కుటుంబంతో కలిసి బయట సమయం గడపాలి.
