Morning Dizziness: చాలామందికి ఉదయం నిద్రలేవగానే మంచం నుంచి లేవడానికి ప్రయత్నించినప్పుడు ఒక్కసారిగా తల తిరిగినట్లు, కళ్లు మసకబారినట్లు లేదా శరీరం తేలికగా అనిపించడం జరుగుతుంది. కొద్దిసేపటికి ఈ లక్షణాలు తగ్గిపోవడంతో చాలా మంది దీనిని సాధారణ బలహీనతగా తీసుకుని పట్టించుకోరు. అయితే ఈ సమస్య తరచుగా ఎదురవుతుంటే అది శరీరం ఇస్తున్న ఒక హెచ్చరిక సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఉదయం పూట తల తిరగడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉంటాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్
మనము పడుకున్నప్పుడు రక్తప్రసరణ ఒక విధంగా ఉంటుంది. అకస్మాత్తుగా లేచి నిలబడినప్పుడు గురుత్వాకర్షణ ప్రభావంతో రక్తం కాళ్లవైపు ఎక్కువగా వెళ్లుతుంది. దీంతో మెదడుకు రక్తప్రసరణ తాత్కాలికంగా తగ్గి తల తిరిగినట్లు అనిపిస్తుంది. ఈ పరిస్థితిని వైద్యులు ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అని అంటారు.
డీహైడ్రేషన్
రాత్రంతా మనం నీరు తాగకుండా నిద్రపోతాం. పగటిపూట కూడా తగినంత నీరు తాగకపోతే ఉదయం సమయానికి శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీని ప్రభావం మెదడుపై పడటం వల్ల తల తిరగడం వంటి సమస్యలు కనిపించవచ్చు.
రక్తహీనత (అనీమియా)
శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉంటే మెదడుకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీని వల్ల తల తిరగడం, అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య ముఖ్యంగా మహిళలు మరియు వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది.
లో షుగర్
రాత్రి భోజనం తక్కువగా చేసినా లేదా డయాబెటిస్ మందులు వాడుతున్నా ఉదయం సమయానికి రక్తంలో చక్కెర స్థాయి పడిపోవచ్చు. దీనివల్ల తల తిరగడంతో పాటు వణుకు, చెమట పట్టడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
విటమిన్ B12 లోపం – ఇతర కారణాలు
నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి విటమిన్ B12 చాలా అవసరం. దీని లోపం ఉన్నా శరీర సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే లోపలి చెవిలో సమస్యలు, అధిక ఒత్తిడి, నిద్రలేమి కూడా తల తిరగడానికి కారణమవుతాయి.
ఈ సమస్యను తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నెమ్మదిగా లేవడం:
నిద్రలేవగానే ఒక్కసారిగా మంచం దిగకండి. ముందుగా పక్కకు తిరిగి నెమ్మదిగా కూర్చోండి. ఒక నిమిషం తర్వాత మాత్రమే నిలబడండి.
నీరు తాగే అలవాటు:
ఉదయం మేల్కొన్న వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని లేదా సాధారణ నీరు తాగడం మంచిది.
పౌష్టికాహారం తీసుకోవాలి:
ఆహారంలో ఐరన్, విటమిన్లు, పోషకాలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి.
ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
తల తిరగడంతో పాటు తీవ్రమైన తలనొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి, మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు లేదా కాళ్లలో తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం.
Also Read: AI Death Clock: మీరు ఎప్పుడు చనిపోతారో ఇలా తెలుసుకోవచ్చు..!
Morning Dizziness: ఉదయం లేవగానే తల తిరిగినట్టు అనిపిస్తుందా..?
