Summer: ఎండాకాలం వచ్చేస్తోంది.. ఈ టిప్స్ తో హెల్త్ జాగ్రత్త

Summer Safety Tips: Keeping Your Family Healthy And Happy

Summer Safety Tips: Keeping Your Family Healthy And Happy

Summer: వేసవి కాలం మెల్లగా మొదలవుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఎండ తీవ్రత ఎక్కువవుతోంది. చాలామంది వర్షాకాలం, చలికాలంలోనే ఎక్కువగా వ్యాధులు వస్తాయని అనుకుంటారు. కానీ వేసవిలో కూడా డీహైడ్రేషన్, వడదెబ్బ, విరేచనాలు, టైఫాయిడ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.

మొదటిగా నీరు ఎక్కువగా తాగాలి.
రోజుకు కనీసం 8–10 గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి పానీయాలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి అలసట తగ్గిస్తాయి. భోజనం తర్వాత మజ్జిగ, సాయంత్రం నిమ్మరసం తాగితే శక్తి కూడా పెరుగుతుంది.

మధ్యాహ్నం ఎండలో బయటకు వెళ్లడాన్ని తగ్గించాలి.
ప్రత్యేకంగా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో అవసరం లేకపోతే బయటకు వెళ్లకపోవడం మంచిది. వెళ్లాల్సి వస్తే ORS ప్యాకెట్, గ్లూకోజ్ నీరు లేదా చక్కెర-ఉప్పు కలిపిన నీరు వెంట తీసుకెళ్లాలి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.

వడదెబ్బ లక్షణాలను గుర్తించాలి.
పిల్లలు, వృద్ధులు, క్రీడాకారులు, ఎక్కువగా మద్యం తాగే వారు వడదెబ్బకు త్వరగా గురవుతారు. శరీర ఉష్ణోగ్రత పెరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చెమట పడకపోవడం, తలనొప్పి, వాంతులు, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. శరీరాన్ని తడిగుడ్డతో చల్లబరచి నీళ్లు ఇచ్చి, ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించాలి.

దుస్తులు కూడా సరైనవే ధరించాలి.
వేసవిలో వదులుగా ఉండే లేత రంగు కాటన్ బట్టలు వేసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు టోపీ, స్కార్ఫ్ లేదా గొడుగు ఉపయోగించాలి. డార్క్ కలర్ బట్టలు వేడి ఎక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి వాటిని తగ్గించడం మంచిది.

AC నుంచి నేరుగా ఎండలోకి వెళ్లకూడదు.
ఎక్కువ చల్లదనం ఉన్న గదిలో నుంచి ఒక్కసారిగా బయట ఎండలోకి వెళితే శరీరం ఇబ్బంది పడుతుంది. బయటకు వెళ్లే ముందు కొద్దిసేపు సాధారణ ఉష్ణోగ్రతలో ఉండడం మంచిది. కూలర్ దగ్గర కూడా ఎక్కువసేపు కూర్చోకుండా కొంత దూరం పాటించాలి.

ఆహారం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
పుచ్చకాయ, కర్బూజ, కీరదోస వంటి నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు తీసుకోవాలి. కారం, ఆయిల్, ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించాలి. అపరిశుభ్రమైన నీరు, ఆహారం వల్ల విరేచనాలు, టైఫాయిడ్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంటి పరిశుభ్రత కూడా తప్పనిసరిగా పాటించాలి. విరేచనాలు లేదా ఇతర సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వేసవిలో కామెర్ల వంటి ఇన్ఫెక్షన్లపైనా జాగ్రత్తగా ఉండాలి.

ఒక్కమాటలో చెప్పాలంటే, వేసవిలో చిన్న జాగ్రత్తలు పాటిస్తే పెద్ద ఆరోగ్య సమస్యలను సులభంగా నివారించవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే నీరు, సరైన ఆహారం, సూర్యరశ్మి నుంచి రక్షణ – ఈ మూడు చాలా ముఖ్యమైనవి.

Also Read: Automobile: సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Summer: ఎండాకాలం వచ్చేస్తోంది.. ఈ టిప్స్ తో హెల్త్ జాగ్రత్త