Sperm Count: పురుషుల స్పెర్మ్ నాణ్యతపై ఇటీవల వెలువడిన ఒక అధ్యయనం ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. సాధారణంగా వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుందని చాలామంది నమ్మకం. కానీ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధన ఈ అభిప్రాయానికి భిన్నమైన ఫలితాలను చూపించింది.
ఈ అధ్యయనంలో 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల మొత్తం 15,581 మంది పురుషుల వీర్య నమూనాలను విశ్లేషించారు. స్పెర్మ్ కౌంట్, మోటిలిటీ (చలనం), ఆకృతి వంటి ముఖ్య ప్రమాణాల ఆధారంగా నాణ్యతను అంచనా వేశారు. ఆశ్చర్యకరంగా, సమ్మర్ లో—ప్రత్యేకంగా జూన్, జూలై నెలల్లో—స్పెర్మ్ నాణ్యత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక వింటర్లో, ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల్లో స్పెర్మ్ నాణ్యత తక్కువగా ఉన్నట్లు తేలింది.
ఈ ఫలితాలు గతంలో ఉన్న అనుమానాలకు విరుద్ధంగా ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల నాణ్యత తగ్గుతుందని భావించినప్పటికీ, పరిశోధనలో మాత్రం వేసవిలో మెరుగైన ఫలితాలు కనిపించడం విశేషం. అయితే స్పెర్మ్ నాణ్యతపై వాతావరణంతో పాటు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి వంటి ఇతర అంశాలు కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ రిపోర్ట్ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న జంటలకు ఉపయోగకరంగా ఉండొచ్చు. అలాగే ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్ ప్లాన్ చేస్తున్న వారికి సరైన సమయాన్ని అంచనా వేసుకునేందుకు ఒక మార్గదర్శకంగా పనిచేయవచ్చు. అయితే ప్రతి వ్యక్తి శరీర పరిస్థితి వేర్వేరుగా ఉండేందున, వ్యక్తిగత వైద్య సలహా తీసుకోవడం అత్యంత అవసరం.
