Beauty Tips: మహిళల మేకప్ కిట్‌లో ఐలైనర్, కాటుక తప్పనిసరిగా ఉండే వస్తువులు. మేకప్ చేయని వారు కూడా ఇవి మాత్రం తరచుగా ఉపయోగిస్తుంటారు. ఇవి కళ్ల అందాన్ని పెంచడమే కాకుండా ముఖానికి ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి. అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది రోజూ వీటిని వాడటం అలవాటు చేసుకుంటారు. అయితే, ఐలైనర్ మరియు కాటుకను ప్రతిరోజూ ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ ఆరుషి సూరి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఉత్పత్తులు నేరుగా కళ్లతో సంబంధం కలిగి ఉండటం వల్ల జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన శుభ్రత పాటించకుండా లేదా గడువు ముగిసిన ఉత్పత్తులను ఉపయోగిస్తే కళ్లలో బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల కళ్లు ఎర్రబడటం, దురద, నీరు కారడం వంటి సమస్యలు కనిపించవచ్చు.
ఇక ఐలైనర్, కాటుకలో ఉండే రసాయనాలు కూడా కొన్నిసార్లు కళ్లకు హానికరం కావచ్చు. రోజూ వాడటం వల్ల అలెర్జీలు, మంట, వాపు వంటి సమస్యలు రావచ్చు. దీన్ని తరచూ ఉపయోగించడం వల్ల కంటి ఉపరితలంపై మరియు కనురెప్పల వెంట్రుకల వద్ద అవశేషాలు పేరుకుపోయి, కార్నియా దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాకుండా కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం కూడా జరగొచ్చు. కొన్ని పరిశోధనల ప్రకారం, దీర్ఘకాలం పాటు సౌందర్య సాధనాలను కళ్లపై ఉపయోగించడం దృష్టిపై కూడా ప్రభావం చూపవచ్చు.
ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లలో ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీ ఉన్నప్పుడు ఐలైనర్, కాటుక వాడకూడదు. గడువు ముగిసిన ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. మేకప్ తొలగించేటప్పుడు కేవలం నీటితో కాకుండా, మృదువైన ఆయిల్ లేదా మేకప్ రిమూవర్ ఉపయోగించడం మంచిది. రాత్రి పడుకునే ముందు కళ్లలో మేకప్ పూర్తిగా తొలగించడం తప్పనిసరి.
అలాగే, ప్రతిరోజూ కాకుండా కొన్నిసార్లు కళ్లకు విశ్రాంతి ఇవ్వడం మంచిది. ఏదైనా సమస్య కనిపిస్తే స్వయంగా మందులు వేసుకోవడం కాకుండా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే కళ్ల అందాన్ని కాపాడుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా రక్షించుకోవచ్చు.
