Excercise: రోజంతా కూర్చుంటున్నారా? ఎక్సర్సైజ్ చేసినా వేస్ట్!

Excercise: రోజంతా గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తాజా పరిశోధనలు స్పష్టంగా చెబుతున్నాయి. చాలామంది ఉదయం కొద్దిసేపు వ్యాయామం చేస్తే సరిపోతుందని భావిస్తారు. కానీ ఉదయం ఎక్సర్సైజ్ చేసినా, మిగతా సమయం మొత్తం కదలకుండా కూర్చుంటే దాని వల్ల వచ్చే నష్టాన్ని వ్యాయామం పూర్తిగా తగ్గించలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రత్యేకంగా రోజుకు 8 గంటలకంటే ఎక్కువసేపు కూర్చునే అలవాటు ఉన్నవారిలో గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం సుమారు 20 శాతం వరకు పెరుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎక్కువసేపు కదలకుండా ఉండటం వల్ల శరీరంలో రక్తప్రసరణ మందగిస్తుంది. రక్తప్రసరణ సరిగా లేకపోతే శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశాలు కూడా పెరుగుతాయి. దీర్ఘకాలంలో ఇది బరువు పెరగడం, అలసట, మెటబాలిజం తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది.

అయితే ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకు, ప్రతి 30 నిమిషాలకు ఒకసారి కుర్చీ నుంచి లేచి కొద్దిసేపు నడవడం, చేతులు-కాల్లు స్ట్రెచ్ చేయడం, లేదా రెండు మూడు నిమిషాలు కదలడం వంటి అలవాట్లు పెట్టుకోవాలి. ఆఫీసులో పని చేస్తున్నా, ఇంట్లో ఉన్నా మధ్యమధ్యలో కదలడం చాలా ముఖ్యం.

సరళంగా చెప్పాలంటే, వ్యాయామం చేయడం ఎంత అవసరమో, రోజంతా ఎక్కువసేపు కూర్చోకుండా మధ్యమధ్యలో కదలడం కూడా అంతే అవసరం. చిన్న మార్పులు చేసినా ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడుకోవచ్చు.

Excercise: రోజంతా కూర్చుంటున్నారా? ఎక్సర్సైజ్ చేసినా వేస్ట్!