Afternoon Sleep: మధ్యాహ్నం నిద్ర పోతున్నారా..?

Is an afternoon nap good for health?

Is an afternoon nap good for health?

Afternoon Sleep: ప్రస్తుత కాలంలో ఉరుకులు పరుగుల జీవిత విధానం వల్ల శారీరకంగా, మానసికంగా అలసట పెరుగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతర పని, ఒత్తిడులు, డెడ్‌లైన్లు కారణంగా చాలామంది అలసటతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం తీసుకునే చిన్నపాటి నిద్ర ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తాజా పరిశోధనల ప్రకారం, కొద్దిసేపు కళ్లుమూసి విశ్రాంతి తీసుకోవడం కూడా శరీరానికి, మెదడుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని తేలింది.

జర్మనీలోని ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయం, స్విట్జర్లాండ్‌లోని జెనీవా విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. చిన్నపాటి మధ్యాహ్న నిద్ర నాడీ కణాల మధ్య సంబంధాలను పునర్వ్యవస్థీకరించడంలో సహాయపడుతుందని పరిశోధకులు గుర్తించారు. దాంతో మేల్కొన్న తర్వాత కొత్త సమాచారాన్ని మరింత సమర్థవంతంగా గుర్తుంచుకునే సామర్థ్యం పెరుగుతుందని వారు తెలిపారు.

మెదడుకు శక్తి, ఏకాగ్రత పెరుగుదల

మధ్యాహ్నం 20–30 నిమిషాల నిద్ర వల్ల మెదడులో ఏర్పడిన అలసట తగ్గుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. కొత్త విషయాలను త్వరగా గ్రహించే శక్తి కూడా పెరుగుతుంది.

మానసిక ప్రశాంతత

నిద్రలేమి కారణంగా చిరాకు, అసహనం, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. మధ్యాహ్నం కొద్దిసేపు నిద్రపోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. దాంతో రోజంతా చురుకుగా, ఉత్సాహంగా పనులు పూర్తి చేయగలుగుతాం.

గుండె ఆరోగ్యానికి మేలు

కొన్ని అధ్యయనాల ప్రకారం మధ్యాహ్న నిద్ర రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండెపై ఉండే ఒత్తిడిని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి తోడ్పడుతుంది.

ఏ సమయంలో? ఎంతసేపు?

వైద్యుల సూచనల ప్రకారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య నిద్రపోవడం ఉత్తమం. 20 నుంచి 30 నిమిషాలు సరిపోతాయి. దీనికంటే ఎక్కువసేపు నిద్రిస్తే శరీరం మందగించడమే కాకుండా, రాత్రి నిద్రకు ఆటంకం కలగవచ్చు.

తిన్న వెంటనే నిద్ర వద్దు

భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం మంచిది కాదు. అలా చేస్తే జీర్ణక్రియ కష్టమవుతుంది. కడుపు సమస్యలు రావచ్చు. అందుకే తిన్న తర్వాత కొద్దిసేపు నడిచి, ఆపై విశ్రాంతి తీసుకోవడం మంచిది.

రాత్రి నిద్రకు ప్రత్యామ్నాయం కాదు

మధ్యాహ్న నిద్రను రాత్రి నిద్రకు బదులుగా భావించకూడదు. ఇది కేవలం అదనపు విశ్రాంతి మాత్రమే. ఆరోగ్యకరమైన జీవనానికి రాత్రి సరైన నిద్ర తప్పనిసరి. అయితే రోజులో కొంత సమయం కేటాయించి చిన్నపాటి మధ్యాహ్న నిద్ర అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పనిలో నాణ్యత కూడా పెరుగుతుంది. అలసటను తగ్గించి ఉత్సాహాన్ని నింపే ఈ మంచి అలవాటు ప్రతి ఒక్కరూ పాటించాలి.

Also Read: Gold Rates: ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు

Afternoon Sleep: మధ్యాహ్నం నిద్ర పోతున్నారా..?