Head Wash: తలస్నానం చేసే సమయంలో షాంపూతో రెండు సార్లు హెయిర్ వాష్ చేయడం కొంతమందికి మంచి ఫలితాలు ఇస్తుందని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. దీనిని సాధారణంగా “డబుల్ వాష్” అని అంటారు. అయితే ఇది సరైన విధంగా, అవసరానికి తగ్గట్టే చేయాలని వారు సూచిస్తున్నారు. మొదటి సారి షాంపూ వేసి తల కడిగితే స్కాల్ప్‌పై పేరుకుపోయిన మురికి, చెమట, అదనపు ఆయిల్, కాలుష్య కణాలు మరియు చుండ్రు వంటి మలినాలు తొలగిపోతాయి. రోజంతా బయట తిరిగే వాళ్లు లేదా ఎక్కువగా ఆయిల్ వాడే వాళ్లకు ఈ మొదటి వాష్ చాలా ఉపయోగపడుతుంది.
మొదటి వాష్‌తో మలినాలు తొలగిన తర్వాత రెండోసారి షాంపూ వాడితే అది జుట్టు మరియు స్కాల్ప్‌పై మరింత సమర్థంగా పనిచేస్తుంది. దీంతో షాంపూలో ఉన్న పోషక పదార్థాలు, ప్రొటీన్లు స్కాల్ప్‌కు నేరుగా చేరి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఫలితంగా తల మరింత శుభ్రంగా ఉండటమే కాకుండా జుట్టు బలంగా, మృదువుగా కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా స్టైలింగ్ ప్రోడక్ట్స్ వాడే వాళ్లకు లేదా కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారికి డబుల్ వాష్ కొన్నిసార్లు ఉపయోగకరంగా ఉంటుంది.
అయితే ప్రతి రోజు రెండు సార్లు షాంపూతో తల కడగడం అవసరం లేదు. అలా అతిగా చేస్తే స్కాల్ప్‌లోని సహజమైన ఆయిల్ పూర్తిగా తగ్గిపోవచ్చు. దాంతో జుట్టు ఎండిపోయి బలహీనంగా మారే ప్రమాదం ఉంది. అందుకే వారానికి అవసరాన్ని బట్టి మాత్రమే డబుల్ వాష్ చేయాలి. మీ జుట్టు రకం, స్కాల్ప్ పరిస్థితిని బట్టి డెర్మటాలజిస్టుల సలహాతో సరైన హెయిర్ కేర్ రొటీన్ పాటిస్తే జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది.
