Morning Routine: ఉదయం నిద్రలేవగానే నీళ్లు తాగడం ఒక మంచి ఆరోగ్య అలవాటు అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పరగడుపున ఒక లీటర్ నీరు తాగితే జీర్ణ సమస్యలు తగ్గడం, శరీరం చురుకుగా మారడం, బరువు నియంత్రణలో ఉండడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని వారు సూచిస్తున్నారు.
రాత్రంతా మన శరీరం దాదాపు 6–8 గంటలు విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఈ సమయంలో నీరు తీసుకోకపోవడం వల్ల శరీరం కొంతవరకు డీహైడ్రేట్ అవుతుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే నీళ్లు తాగడం వల్ల శరీరం మళ్లీ యాక్టివ్ అవుతుంది. ఆ సమయానికి సాధారణ నీళ్లే ఒక ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు.
చాలా మంది ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీ తాగే అలవాటు పెట్టుకుంటారు. కొందరు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతారు. ఇది కొంతవరకు మంచిదే అయినప్పటికీ, నిమ్మకాయలో ఉండే అధిక ఆమ్లత్వం కారణంగా ప్రతిరోజూ తాగడం వల్ల అసిడిటీ సమస్యలు రావచ్చు. అందుకే సాధారణంగా పరగడుపున స్వచ్ఛమైన నీరు తాగడం ఉత్తమం.
పరగడుపున నీరు తాగితే శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ చురుకుగా మారుతుంది. పేగుల్లో కదలికలు పెరిగి, మలబద్ధకం, గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. మోషన్ సాఫీగా జరిగితే రోజంతా తేలికగా అనిపిస్తుంది.
ఇది మాత్రమే కాదు, శరీరంలో పేరుకుపోయిన మలినాలు (టాక్సిన్స్) బయటకు వెళ్లేందుకు నీరు సహాయపడుతుంది. యూరిన్, మలవిసర్జన ద్వారా అవి బయటకు వెళ్లిపోవడంతో శరీరం శుభ్రంగా ఉంటుంది. దీని వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా మెరిసిపోతుంది. మొటిమలు, చర్మ పొడిబారడం వంటి సమస్యలు తగ్గుతాయి.
ఉదయం నీరు తాగడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. శరీరం హైడ్రేట్ అయినప్పుడు మెదడు కూడా చురుగ్గా పని చేస్తుంది. దాంతో పనిపై దృష్టి పెరుగుతుంది, మూడ్ కూడా మెరుగుపడుతుంది. అలాగే క్యాలరీలు కరిగే ప్రక్రియ కూడా వేగవంతమవుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఉపయోగకరం.
అయితే, ప్రతి ఒక్కరూ ఒకేసారి లీటర్ నీరు తాగడం సరైనది కాదు. ముఖ్యంగా గుండె, కిడ్నీ, లివర్ సమస్యలున్న వారు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు ముందుగా వైద్యుల సలహా తీసుకుని, తమ శరీరానికి అనుగుణంగా నీటి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది.
మొత్తానికి, ఉదయం నిద్రలేవగానే నీరు తాగడం ఒక సులభమైన కానీ చాలా ప్రయోజనకరమైన అలవాటు. దీన్ని క్రమం తప్పకుండా పాటిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది, రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు.
