Health Tips: ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులకు అది ఒక ప్రత్యేకమైన రోజు. చాలామంది ఆదివారం కోసం ఎదురుచూస్తూ మటన్, చికెన్ వంటి మాంసాహార వంటకాలను ఆస్వాదించడానికి సిద్ధమవుతారు. ముఖ్యంగా నగరాల్లో అయితే ఆదివారం మాంసం తినడం ఒక అలవాటుగా మారిపోయింది. గ్రామాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. కొందరు ఉదయం నుంచి ఏమీ తినకుండా మధ్యాహ్నం వరకు వేచి ఉండి యాటపోతు కూర లేదా ఇతర మాంసాహార వంటకాలను రుచిగా ఆస్వాదిస్తుంటారు. ఒకవేళ ఏదైనా కారణంతో ఆదివారం మాంసం తినలేకపోతే ఏదో కోల్పోయిన భావన కలుగుతుందని చాలామంది చెబుతుంటారు.
ఇలా మాంసాహారం తింటూ ఉండగా చాలా మందికి పక్కన కూల్ డ్రింక్స్ లేదా సాఫ్ట్ డ్రింక్స్ తాగడం కూడా అలవాటుగా ఉంటుంది. ఈ కాంబినేషన్ చాలామందికి రుచిగా అనిపించినా, ఆరోగ్యంపై మాత్రం కొన్ని ప్రభావాలు చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కొంతమందికి మాంసాహారం తింటూ కూల్ డ్రింక్స్ తాగితే శరీరం కొంత రిఫ్రెష్ అయినట్టుగా అనిపిస్తుంది. అయితే ఇది కేవలం తాత్కాలిక భావన మాత్రమే అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చికెన్ లేదా మటన్ వంటి మాంసాహారంతో కలిసి సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగించే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా తినడం వల్ల శరీరం ఆహారాన్ని జీర్ణించుకోవడం కాస్త కష్టంగా మారుతుంది.
అదే సమయంలో మాంసాహారం, కూల్ డ్రింక్స్ కలిసి తినడం వల్ల రుచి బాగుందని అనిపించి కొంచెం ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. దీనివల్ల కేలరీలు అధికంగా తీసుకోవడం జరిగి బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా చక్కెర ఎక్కువగా ఉండే కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడమే కాకుండా దంత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఇంకా కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం మాంసాహారంతో పాటు అధిక కేలరీలు కలిగిన సాఫ్ట్ డ్రింక్స్ తరచుగా తీసుకుంటే కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉండొచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారు ఇలా తినడం తగ్గించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అదే విధంగా కేవలం నాన్ వెజ్ మాత్రమే కాదు, సాధారణంగా వేజ్ భోజనం చేసిన వెంటనే కూడా కూల్ డ్రింక్స్ తాగకూడదని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే ఇది జీర్ణక్రియలో ముఖ్యమైన ఎంజైమ్‌ల ప్రభావాన్ని తగ్గించి జీర్ణ ప్రక్రియను నెమ్మదిగా చేస్తుంది. దీంతో కడుపు ఉబ్బరం, అజీర్ణం, అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
కాబట్టి మాంసాహారం లేదా ఇతర భోజనం చేసిన వెంటనే కూల్ డ్రింక్స్ తాగే అలవాటు తగ్గించడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
