Cancer: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, శరీరంలో కనిపించే చిన్న చిన్న మార్పులపైనా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రజలకు అప్రమత్తత అవసరమని హెచ్చరించింది. కొన్ని లక్షణాలు సాధారణంగా అనిపించినా, అవి తీవ్రమైన సమస్యలకు సంకేతాలై ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
అకస్మాత్తుగా ఎలాంటి డైట్ లేకుండా బరువు తగ్గిపోవడం ఒక ముఖ్య లక్షణంగా పరిగణించాలి. అలాగే ఎక్కువ రోజులు జ్వరం తగ్గకపోవడం, నిరంతరం తీవ్రమైన అలసట ఉండటం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాల్లా కనిపించినా, కొన్ని సందర్భాల్లో అవి క్యాన్సర్‌కు సంకేతాలుగా ఉండొచ్చు.
చర్మం రంగు మారడం, కొత్త మచ్చలు రావడం లేదా ఇప్పటికే ఉన్న మచ్చల ఆకారం, రంగులో మార్పులు కనిపించడం కూడా గమనించాల్సిన విషయం. మలంలో లేదా మూత్రంలో రక్తం పడటం చాలా సీరియస్ లక్షణం. అలాగే నాలుగు వారాలైనా గాయాలు మానకపోవడం, నోటి పుండ్లు ఎక్కువ రోజులు తగ్గకపోవడం కూడా వైద్యులను సంప్రదించాల్సిన పరిస్థితి.
ఇంకా ఆహారం మింగడం కష్టంగా అనిపించడం, గొంతులో ఏదో అడ్డుగా ఉన్న భావన రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ఇవన్నీ తప్పనిసరిగా క్యాన్సర్ అని అర్థం కాదు. అయితే ముందస్తుగా గుర్తిస్తే చికిత్స సులభంగా ఉండే అవకాశం ఎక్కువ.
