UPI Charges: దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో యూపీఐ వినియోగం కూడా భారీగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్ ఉన్న దాదాపు ప్రతి ఒక్కరూ తమ బ్యాంక్ ఖాతాను రెండు లేదా మూడు యూపీఐ యాప్‌లతో లింక్ చేసుకుని రోజువారీ చెల్లింపులు చేస్తున్నారు. చిన్న టీ దుకాణం నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు యూపీఐ ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి. రోజూ లక్షల కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు ఈ వ్యవస్థలో నమోదవుతున్నాయి. మొత్తం డిజిటల్ లావాదేవీలలో 60 శాతానికి పైగా యూపీఐ ద్వారానే సాగుతున్నాయి.
అయితే వినియోగం పెరిగే కొద్దీ కొన్ని వదంతులు కూడా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా రూ.1000కు పైగా యూపీఐ ద్వారా డబ్బు పంపితే సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తారనే వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి. దీంతో సామాన్య ప్రజలతో పాటు చిరు వ్యాపారుల్లో కూడా గందరగోళం నెలకొంది.
ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పష్టత ఇచ్చాయి. ప్రస్తుత విధానం ప్రకారం వ్యక్తుల మధ్య జరిగే P2P ట్రాన్సాక్షన్లు, అలాగే వ్యక్తుల నుంచి వ్యాపారులకు జరిగే P2M లావాదేవీలు పూర్తిగా ఉచితం అని వెల్లడించాయి. యూపీఐపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించే నిర్ణయం లేదని, ఇలాంటి అసత్య వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించాయి. డిజిటల్ ఇండియా లక్ష్యానికి భంగం కలిగించే విధంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కూడా తెలిపాయి.
డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించేందుకు 2026–27 వార్షిక బడ్జెట్‌లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ, రూపే డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల వినియోగాన్ని పెంచేందుకు సుమారు రూ.2 వేల కోట్లు కేటాయించింది. ఈ నిధుల ద్వారా బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చి, చిరు వ్యాపారులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) భారం పడకుండా చూస్తోంది. అందువల్ల సామాన్యులకు యూపీఐ సేవలు ఇప్పటికీ ఉచితంగానే అందుతున్నాయి.
ప్రస్తుతం సాధారణ యూజర్ రోజుకు సుమారు రూ.1 లక్ష వరకు యూపీఐ ద్వారా చెల్లింపు చేయవచ్చు. వ్యాపార ఖాతాలకు అయితే రూ.5 లక్షల వరకు పరిమితి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి నిమిషం లక్షల్లో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఛార్జీలు విధిస్తే ప్రజలు మళ్లీ నగదు చెల్లింపుల వైపు వెళ్లే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే భారీ నిధులు కేటాయిస్తూ యూపీఐ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది.
