Samantha: ప్రముఖ నటి సమంత తన వ్యక్తిగత జీవితం, భర్త రాజ్ నిడిమోరుతో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన రాబోయే చిత్రం ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా, తమ వైవాహిక జీవితం గురించి భావోద్వేగంగా మాట్లాడారు.
సమంత – రాజ్ నిడిమోరుల పరిచయం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సెట్స్‌లో ప్రారంభమైంది. అనంతరం ‘సిటాడెల్: హనీ బన్నీ’ ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేశారు. 2024లో వీరి సంబంధంపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. చివరకు 2025 డిసెంబర్లో కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.
ఒక ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ, తమ బంధం ఎంత బలంగా ఉందో వివరించారు. “మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాం. పని అయినా, ప్రయాణాలు అయినా, వర్కౌట్స్ అయినా కలిసి చేస్తాం. ఒక రోజు కూడా ఆయనకు దూరంగా ఉండటం నాకు చాలా కష్టంగా ఉంటుంది. నిజంగా మేము కొంచెం ఇరిటేటింగ్ కపుల్‌లా ఉంటాం” అని ఆమె సరదాగా అన్నారు. తమ సంబంధం హనీమూన్ దశను దాటి మరింత లోతైన అనుబంధంగా మారిందని చెప్పారు.
రాజ్ నిడిమోరు తన కెరీర్‌పై కూడా మంచి ప్రభావం చూపించారని సమంత వెల్లడించారు. హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో, దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్ మధ్య ఉన్న అనుబంధాన్ని ఉదాహరణగా తీసుకుంటూ, రాజ్‌తో కలిసి పనిచేయడం వల్ల తన నటనలో మెరుగుదల వచ్చిందని చెప్పారు. ఆయన ప్రోత్సాహంతో తాను మంచి నటిగా ఎదుగుతున్నానని పేర్కొన్నారు. అయితే ఈ పోలికపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం సమంత, రాజ్ కలిసి ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో సమంత చేసిన వ్యాఖ్యలు ఆమె అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.
