Virosh: టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారిన జంట విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న ఇవాళ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2026 ఫిబ్రవరి 26, గురువారం ఉదయం హిందూ సంప్రదాయ పద్ధతిలో విజయ్ రష్మిక మెడలో తాళి కట్టి ఆమెను తన జీవిత భాగస్వామిగా స్వీకరించారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అరవళ్ల కొండల నడుమ అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సంప్రదాయం, ఆచారం, ఆత్మీయత కలిసిన ఈ వివాహం అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేపుతోంది.
సాయంత్రం 4:30 గంటలకు రష్మిక కుటుంబ సంప్రదాయం అయిన కొడవ పద్ధతిలో మరోసారి వివాహ వేడుక నిర్వహించనున్నారు. రష్మిక కొడవ వర్గానికి చెందినవారు కావడంతో, వారి ఆచారాలకు అనుగుణంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
వివాహం అనంతరం “విరోష్” జంట హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వనున్నట్లు సమాచారం. మార్చి 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో ఈ వేడుక జరగనుంది. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశముండటంతో ఈ రిసెప్షన్ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.
విజయ్–రష్మిక ప్రేమకథ 2018లో వచ్చిన ‘గీత గోవిందం’ సినిమా సమయంలో మొదలైంది. ఆ చిత్ర షూటింగ్ సందర్భంగా ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. తర్వాత 2019లో ‘డియర్ కామ్రేడ్’లో కలిసి నటించడం ద్వారా వారి బంధం మరింత బలపడింది. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు తరచూ వినిపించాయి. ఒకే ప్రదేశాల్లో వెకేషన్ ఫొటోలు కనిపించడం ఆ ప్రచారాలకు బలం చేకూర్చింది.
ఎట్టకేలకు ఉదయపూర్ సాక్షిగా ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది. ఆసక్తికర విషయం ఏమిటంటే—వారి పెళ్లిలో ఏడడుగులు, ప్రేమలో ఏడేళ్లు, అలాగే ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా ఏడేళ్లేనట. దీంతో ఈ “విరోష్” జంట పెళ్లి అభిమానుల్లో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
