Gaddar Film Awards: 2025 గద్దర్ అవార్డులు.. ఉత్తమ చిత్రంగా ‘రాజు వెడ్స్ రాంబాయి’

Gaddar Awards_ Here's the list of winners for 2026

Gaddar Awards_ Here's the list of winners for 2026

Gaddar Film Awards: ప్రముఖ ప్రజా గాయకుడు, విప్లవ గాయకుడు గద్దర్ జ్ఞాపకార్థంగా తెలంగాణ ప్రభుత్వం “గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్” ను ప్రకటించిన విషయం తెలిసిందే. నంది అవార్డులకు ప్రత్యామ్నాయంగా ఈ అవార్డులను ప్రభుత్వం అందజేస్తోంది. దాదాపు 14 సంవత్సరాల విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ సినీ పురస్కారాలను ప్రారంభించగా, ఈసారి గద్దర్ పేరుతో అవార్డులను ఇవ్వడం విశేషం.

2025 సంవత్సరానికి సంబంధించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ తుది జాబితాను జ్యూరీ సభ్యులు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు అందజేశారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, నటుడు తనికెళ్ల భరణి, నటి రోజా రమణి, ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ, నటి ప్రగతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జ్యూరీ చైర్మన్ మణిశర్మ ఆధ్వర్యంలో విజేతల జాబితాను అధికారికంగా ప్రకటించారు.

ఈ అవార్డుల్లో సినీ రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులకు ప్రత్యేక పురస్కారాలు కూడా ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ ఇవ్వగా, ప్రముఖ నటి జయసుధకు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్) అవార్డ్ ప్రకటించారు. అలాగే పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డును కమల్ హాసన్ కు ప్రకటించారు.

ఈ ఏడాది మొత్తం 17 ప్రధాన విభాగాల్లో అవార్డులు అందజేస్తున్నారు. అదనంగా సామాజిక సందేశం కలిగిన సినిమాలు, పర్యావరణ అంశాలు వంటి ప్రత్యేక కేటగిరీలలో కూడా అవార్డులు ఇవ్వడం విశేషం. అలాగే డాక్టర్ సి.నారాయణరెడ్డి, ఏఎన్ఆర్ వంటి ప్రముఖుల పేర్లతో ప్రత్యేక పురస్కారాలు కూడా ప్రకటించారు.

ఈ ఏడాది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా “రాజు వెడ్స్ రాంబాయి” ఎంపికైంది. ఉత్తమ నటుడిగా “తండేల్” చిత్రానికి నాగచైతన్య, ఉత్తమ నటిగా “ది గర్ల్ ఫ్రెండ్” చిత్రానికి రష్మిక మందన్న ఎంపికయ్యారు.

ఇతర ముఖ్య విభాగాల్లో కూడా పలువురు సినీ ప్రముఖులు అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి) ఎంపికయ్యారు. ఉత్తమ ద్వితీయ చిత్రం “దండోరా”, తృతీయ చిత్రం “ది ప్రీ వెడ్డింగ్ షో” గా నిలిచాయి.

ఇక ఉత్తమ సపోర్టింగ్ నటుడిగా శివాజీ, ఉత్తమ సపోర్టింగ్ నటిగా భూమిక, ఉత్తమ సంగీత దర్శకుడిగా మార్క్ కె రాబిన్ (దండోరా) అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా అనురాగ్, నేపథ్య గాయని సాహితి చాగంటి ఎంపికయ్యారు.

సాంకేతిక విభాగాల్లో కూడా పలువురు అవార్డులు సాధించారు. ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్), ఉత్తమ ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌గా తోట తరణి, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా చంద్రకాంత్ అవార్డులు అందుకున్నారు.

ఇక ప్రత్యేక పురస్కారాల్లో బి.ఎన్. రెడ్డి అవార్డు సింగీతం శ్రీనివాసరావుకు, చక్రపాణి అవార్డు చలసాని అశ్వనీదత్‌కు, కాంతారావు అవార్డు ఆర్. నారాయణమూర్తికి, ఘంటసాల వెంకయ్య అవార్డు ప్రసాద్ ల్యాబ్స్‌కు చెందిన రమేష్ ప్రసాద్‌కు, సి. నారాయణ రెడ్డి అవార్డు సుద్దాల అశోక్ తేజకు ప్రకటించారు.

Also Read: Gas Cylinder Price: భారీగా పెరిగిన సిలిండర్ ధరలు

Gaddar Film Awards: 2025 గద్దర్ అవార్డులు.. ఉత్తమ చిత్రంగా ‘రాజు వెడ్స్ రాంబాయి’