Kerala Story 2: ఫైనల్లీ ‘ది కేరళ స్టోరీ 2’ రిలీజ్.. మూవీ ఎలా ఉందంటే..

Finally ‘The Kerala Story 2’ released.. review here..

Finally ‘The Kerala Story 2’ released.. review here..

Kerala Story 2: విడుదలకు ముందే వివాదాలతో వార్తల్లో నిలిచే చిత్రాల్లో ‘ది కేరళ స్టోరీ 2’ కూడా ఒకటి. సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు కేరళ హైకోర్టు స్టే విధించగా, మరుసటి రోజే డివిజన్ బెంచ్ ఆ ఆదేశాలను రద్దు చేసి విడుదలకు అనుమతి ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా శుక్రవారం సెకండ్ షోలతో ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. తొలి భాగం ‘కేరళ స్టోరీ’లా ఇదీ వివాదాస్పద కథాంశాన్నే తీసుకువచ్చిందా? దర్శకుడు ఈసారి ఎలాంటి అంశాన్ని ఎంచుకున్నాడు? అనేది ఆసక్తికరంగా మారింది.

కథ ఏమిటి?

స్వతంత్ర ఆలోచనలు కలిగిన నేటి తరం యువతుల జీవితాలే ఈ చిత్రానికి కేంద్రబిందువు. కేరళకు చెందిన సురేఖ (ఉల్కా గుప్త) యూపీఎస్సీకి సిద్ధమవుతుంటుంది. జర్నలిస్ట్ సలీమ్ (సుమిత్ గహ్లావత్)తో పరిచయం ప్రేమగా మారి, లివింగ్ రిలేషన్ వరకు వెళుతుంది. దివ్య (అదితి భాటియా) సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కావాలని కలలు కంటుంది. ఆమె చేసే డ్యాన్సులను తల్లిదండ్రులు సమర్థించకపోయినా, రషీద్ (యుక్త భోస్లా) ప్రేమ పేరుతో ఆమెకు అండగా ఉంటానని నమ్మబలుకుతాడు. మరోవైపు జావెలిన్ త్రో క్రీడాకారిణి నేహా (ఐశ్వర్య ఓజా) జాతీయ స్థాయికి ఎదగాలనుకుంటుంది. రాజు అలియాస్ ఫైజన్ ఆమెకు ట్రైనింగ్ ఇప్పిస్తానని చెప్పి దగ్గరవుతాడు.

ప్రేమ నమ్మి, తల్లిదండ్రుల మాటలను పట్టించుకోకుండా వెళ్లిపోయిన ఈ ముగ్గురు యువతుల జీవితాలు ఎలా మలుపుతిరిగాయి? వారు ఎదుర్కొన్న మోసం ఏమిటి? నిజం తెలుసుకున్న తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? అన్నదే కథ.

ఎలా ఉంది?

మొదటి భాగంలో మతమార్పిడి, విదేశాలకు అక్రమ రవాణా వంటి అంశాలను ప్రస్తావించిన దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్, ఈసారి కూడా అలాంటి వాస్తవ సంఘటనల ప్రేరణతో కథను తెరకెక్కించినట్లు తెలిపారు. ప్రేమ పేరుతో మోసం చేసి, మతం మారుస్తూ యువతులను ఎలా దారితప్పిస్తున్నారు? మాట వినకపోతే ఎలాంటి హింసకు గురి చేస్తున్నారు? వంటి అంశాలను చూపించే ప్రయత్నం చేశారు.

మొదటి భాగంలో యువతుల కలలు, ఆశయాలు, కుటుంబ నేపథ్యాన్ని చూపిస్తూ కథ కొంత నెమ్మదిగా సాగుతుంది. ముగ్గురు యువతులు తమ ప్రేమికుల అసలు స్వరూపం తెలుసుకునే సన్నివేశాలతో ఇంటర్వెల్ ఆసక్తికరంగా ముగుస్తుంది. ద్వితీయార్ధంలో హింసాత్మక సన్నివేశాలు, భావోద్వేగాలు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్నిచోట్ల దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లు అనిపిస్తుంది. మూడు ప్రాంతాల్లో జరిగే కథకు ‘ది కేరళ స్టోరీ’ అనే టైటిల్ ఎందుకు పెట్టారో స్పష్టంగా అనిపించకపోవచ్చు.

నటీనటుల ప్రదర్శన

ఉల్కా గుప్త, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా బాధితుల పాత్రల్లో హృదయానికి హత్తుకునేలా నటించారు. ముఖ్యంగా నేహా పాత్ర భావోద్వేగాన్ని రేకెత్తిస్తుంది. యువకుల పాత్రల్లో సుమిత్ గహ్లావత్, అర్జున్ సింగ్, యుక్త భోస్లా కర్కశత్వాన్ని బాగా చూపించారు. సాంకేతికంగా సినిమా మెరుగ్గా ఉంది. రచయితలు విపుల్ అమృతల్ షా, అమర్నాథ్ కొన్ని వాస్తవ సంఘటనలను తీసుకుని కథను నిర్మించారు. క్లైమాక్స్ కొంత అతిశయంగా అనిపించవచ్చు.

బలాలు

  • ప్రధాన నటీనటుల నటన

  • కథాంశం

  • ద్వితీయార్ధం, క్లైమాక్స్ ప్రభావం

బలహీనతలు

  • కథను ఒక కోణంలోనే చూపించడం

  • కొన్నిచోట్ల సినిమాటిక్ స్వేచ్ఛ ఎక్కువగా తీసుకోవడం

చివరిగా:
‘ది కేరళ స్టోరీ 2’ నేటి జెన్-జీ యువత తీసుకునే తొందరపాటు నిర్ణయాలపై హెచ్చరికలా నిలుస్తుంది. అయితే కథను ఒక కోణం నుంచే చెప్పడం వల్ల అన్ని వర్గాలకు నచ్చకపోవచ్చు.

గమనిక: ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Also Read: Ayesha Meera Case: ఆయేషా మీరా కేసు..17 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి స్వస్తి!

Kerala Story 2: ఫైనల్లీ ‘ది కేరళ స్టోరీ 2’ రిలీజ్.. మూవీ ఎలా ఉందంటే..