Gold Loan: అత్యవసర పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు చాలా మంది ముందుగా బ్యాంకులను ఆశ్రయిస్తారు. బయట వ్యక్తుల వద్ద అప్పు తీసుకుంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తక్కువ వడ్డీతో, వేగంగా రుణం పొందాలనుకునే వారికి గోల్డ్ లోన్ మంచి ఎంపికగా భావిస్తారు. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో గోల్డ్ లోన్ చాలా త్వరగా మంజూరు అవుతుంది. అయితే గోల్డ్ లోన్ తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం అవసరం.
గోల్డ్ లోన్‌కు అర్హతలు ఏమిటి?
ఇతర రుణాలతో పోలిస్తే గోల్డ్ లోన్ తీసుకోవడానికి కఠినమైన అర్హతలు ఉండవు. ఆదాయపు ధృవీకరణ పత్రాలు అవసరం ఉండదు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా పెద్దగా సమస్య కాదు. ఎందుకంటే ఈ రుణం పూర్తిగా బంగారం విలువ ఆధారంగా మంజూరు అవుతుంది. 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా, సంబంధిత బ్యాంకులో ఖాతా ఉంటే గోల్డ్ లోన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత వరకు లోన్ లభిస్తుంది?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, తాకట్టు పెట్టిన బంగారం విలువలో గరిష్టంగా 75 శాతం వరకు రుణం పొందవచ్చు. ఉదాహరణకు ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.64 వేలుగా ఉంటే, దానిపై గరిష్టంగా రూ.48 వేల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. దీనిని లోన్ టు వాల్యూ (LTV) రేషియో అంటారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చా?
గతంలో గోల్డ్ లోన్ కోసం తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సి ఉండేది. అయితే ఇప్పుడు చాలా బ్యాంకులు ఆన్‌లైన్‌లో అప్లై చేసే సదుపాయం కల్పిస్తున్నాయి. బ్యాంకు ప్రతినిధి ఇంటికే వచ్చి బంగారం స్వచ్ఛతను పరీక్షిస్తారు. అవసరమైన ప్రక్రియ పూర్తయ్యాక కొన్ని సందర్భాల్లో 30 నిమిషాల్లోనే లోన్ మొత్తం ఖాతాలో జమ అవుతుంది.
గోల్డ్ లోన్ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం
కొన్ని షెడ్యూల్డ్ బ్యాంకులు గోల్డ్ లోన్‌పై ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నాయి. రుణ మొత్తాన్ని ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలో జమ చేసి, అవసరమైనంత మొత్తాన్ని మాత్రమే ఉపసంహరించుకునే వీలుంటుంది. తీసుకున్న మొత్తంపైనే వడ్డీ చెల్లించాలి. టెన్యూర్ పూర్తయ్యే సమయానికి అసలు మరియు వడ్డీ మొత్తాన్ని చెల్లించాలి.
ప్రాసెసింగ్ ఫీజులు, అవసరమైన పత్రాలు
గోల్డ్ లోన్‌పై సాధారణంగా లోన్ మొత్తంపై 0 నుంచి 2 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తారు. దీనిపై జీఎస్టీ అదనంగా ఉంటుంది. బ్యాంకును బట్టి ఈ ఫీజులు మారవచ్చు. రుణం కోసం అడ్రస్ ప్రూఫ్, జనన తేదీ ధృవీకరణ, పాన్ కార్డు నంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు వంటి పత్రాలు అవసరం అవుతాయి.
Also Read: Virosh Wedding: విజయ్-రష్మిక పెళ్లి.. నగల విలువ ఎంతో తెలుసా?
Gold Loan: గోల్డ్ లోన్ ఎప్పుడు తీసుకోవాలంటే..
