Automobile: కొత్త కార్ల ధరలు పెరుగుతూ ఉండటంతో చాలా మంది ఇప్పుడు యూజ్డ్ లేదా సెకండ్‌హ్యాండ్ కార్లు కొనాలని భావిస్తున్నారు. నిజానికి సరైన ధరలో మంచి కారు దొరికితే ఇది మంచి డీల్ అవుతుంది. అయితే సరైన పరిశీలన లేకుండా కొనుగోలు చేస్తే తర్వాత పెద్ద రిపేర్ ఖర్చులు, డాక్యుమెంట్ సమస్యలు, లీగల్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే సెకండ్ హ్యాండ్ కారు కొనేముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా చెక్ చేయాలి.
1. సర్వీస్ హిస్టరీ తప్పనిసరిగా చూడాలి
కారు ఎంత బాగా మెయింటైన్ చేశారో తెలుసుకోవడానికి షోరూమ్ సర్వీస్ రికార్డులు కీలకం. ఆయిల్ మార్పులు, బ్రేక్ సర్వీస్, ప్రధాన రిపేర్లు సమయానికి జరిగాయా లేదా రికార్డుల్లో కనిపిస్తుంది. సాధారణంగా ప్రతి 10,000 కి.మీ.కి లేదా ఏడాదికి ఒకసారి సర్వీస్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా అధికారిక సర్వీస్ సెంటర్‌లో ఈ వివరాలు తెలుసుకోవచ్చు. రికార్డులు లేకపోతే జాగ్రత్తగా ఉండాలి.
2. ఇన్సూరెన్స్ వివరాలు చెక్ చేయాలి
ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్న IDV (Insured Declared Value) విలువను చూడాలి. అలాగే నో క్లెయిమ్ బోనస్ ఉంటే కారు పెద్ద ప్రమాదానికి గురి కాలేదని అర్థం. క్లెయిమ్ రికార్డులు ఎక్కువగా ఉంటే గతంలో యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు.
3. కారు బయట, లోపల పరిస్థితి పరిశీలించాలి
ఎక్స్‌టీరియర్‌లో తుప్పు, పెయింట్ తేడాలు, ప్యానెల్ గ్యాప్‌లు ఉన్నాయా చూడాలి. గ్లాస్‌పై కోడ్ మార్కింగ్‌లు సరిపోలకపోతే గ్లాస్ మార్చిన అవకాశం ఉంటుంది. టైర్లు, బ్రేకులు, అండర్‌బాడీ కూడా చెక్ చేయాలి. ఈ భాగాల రిపేర్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది.
4. ఓనర్ వివరాలు, డాక్యుమెంట్లు సరిపోలాలి
సింగిల్ ఓనర్ వాహనం అయితే సాధారణంగా మెరుగైన ఎంపికగా భావిస్తారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లో ఉన్న పేరు, అడ్రస్, వాహనం అమ్ముతున్న వ్యక్తి వివరాలు సరిపోతున్నాయా చూసుకోవాలి.
5. లీగల్ పేపర్లు, బకాయిలు క్లియర్‌గా ఉండాలి
చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్, PUC, రోడ్ ట్యాక్స్ పూర్తి అయిందా చూడాలి. లోన్ ఉంటే హైపోథెకేషన్ NOC తీసుకోవాలి. ట్రాఫిక్ చలాన్లు లేదా లీగల్ కేసులు లేవని నిర్ధారించాలి. వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలంటే కూడా NOC అవసరం.
మొత్తానికి, సెకండ్ హ్యాండ్ కారు కొనడం లాభదాయకమే కానీ జాగ్రత్తగా పరిశీలిస్తేనే మంచిది. కారు చూడడానికి వెళ్లేటప్పుడు నమ్మకమైన మెకానిక్‌ను వెంట తీసుకెళ్లడం ఇంకా సురక్షితం. సరైన సమాచారం తెలుసుకుని నిర్ణయం తీసుకుంటే మంచి వాహనం సులభంగా దొరుకుతుంది.
