మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేదు. సిప్ (SIP) రూపంలో కనీసం రూ.100 లేదా రూ.500 నుంచి కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు. అలాగే కొందరు లంప్సమ్ రూపంలో ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెడతారు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు పెట్టుబడి కొనసాగిస్తేనే కాంపౌండింగ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
చాలా మంది ఎక్కువ డబ్బు పెట్టినప్పుడే మంచి రాబడి వస్తుందని భావిస్తారు. కానీ నిజానికి పెట్టుబడి మొత్తం కంటే ఎప్పటి నుంచి పెట్టుబడి ప్రారంభించామన్నది మరింత ముఖ్యమైన విషయం. చిన్న వయసులోనే పెట్టుబడి ప్రారంభిస్తే, చిన్న మొత్తంతోనూ దీర్ఘకాలంలో మంచి సంపదను కూడబెట్టుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది 20 ఏళ్ల వయసులోనే ఉద్యోగాల్లో చేరుతున్నారు. అందువల్ల అదే సమయంలో పెట్టుబడి ప్రారంభించడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఉదాహరణకు, మీ నెల జీతం రూ.30 వేలైనా సరే, నెలకు రూ.1000 చొప్పున సిప్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ సగటున సంవత్సరానికి సుమారు 12 శాతం వరకు రాబడి ఇవ్వగలవు. ఒక వ్యక్తి 20 ఏళ్ల వయసులో సిప్ ప్రారంభించి, 60 ఏళ్ల వరకు అంటే 40 సంవత్సరాలు పెట్టుబడి కొనసాగిస్తే మొత్తం పెట్టుబడి రూ.4.80 లక్షలు మాత్రమే అవుతుంది. అయితే కాంపౌండింగ్ ప్రభావంతో రిటైర్మెంట్ సమయానికి దాదాపు రూ.98 లక్షల వరకు సంపద ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇందులో లాభం మాత్రమే రూ.93 లక్షలకుపైగా ఉంటుంది.
కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సగటున సంవత్సరానికి 15 శాతం వరకు రాబడి ఇవ్వగలవు. అలాంటి పరిస్థితిలో అదే రూ.4.80 లక్షల పెట్టుబడి రిటైర్మెంట్ సమయానికి దాదాపు రూ.2.30 కోట్లకుపైగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అయితే పెట్టుబడి ఆలస్యంగా ప్రారంభిస్తే రాబడిపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వయసులో నెలకు రూ.1000 సిప్ ప్రారంభించి 60 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టినట్లయితే మొత్తం కాలం 30 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఈ పరిస్థితిలో 12 శాతం రాబడి అంచనా ప్రకారం సుమారు రూ.30.80 లక్షలు మాత్రమే లభిస్తాయి. అదే 15 శాతం రాబడి వచ్చినా దాదాపు రూ.56 లక్షల వరకు మాత్రమే వస్తుంది.
అందుకే మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువ డబ్బు పెట్టడంకంటే, త్వరగా పెట్టుబడి ప్రారంభించడం ఎంతో ముఖ్యం. చిన్న మొత్తంతోనే ప్రారంభించినా దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రభావంతో మంచి సంపదను కూడబెట్టుకోవచ్చు.