Couple Goals: భార్యాభర్తల మధ్య తరచూ గొడవలకు కారణాలివే..!

Common Reasons Couples Fight

Common Reasons Couples Fight

Couple Goals: ఈ రోజుల్లో చాలా మంది “పెళ్లంటే నూరేళ్ల మంట” అంటూ పెళ్లి విషయానికి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, మనశ్శాంతి లేకపోవడం. చిన్నచిన్న విషయాలతో మొదలయ్యే విభేదాలు క్రమంగా పెద్ద గొడవలుగా మారి చివరకు విడాకుల వరకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది దంపతులు విడాకులు తీసుకోవడానికి ఇదే ప్రధాన కారణంగా మారుతోంది. అలాంటి పరిస్థితులకు దారితీసే కొన్ని సాధారణ కారణాలు ఇవి.

చుట్టాలు, కుటుంబ వ్యవహారాలు

ఇప్పటి కాలంలో చాలా మంది వివాహిత జంటలు తల్లిదండ్రులకు దూరంగా ఉండి స్వతంత్రంగా జీవిస్తున్నారు. స్వేచ్ఛగా ఉండాలనే ఆలోచనతో జాయింట్ ఫ్యామిలీలు తగ్గిపోతున్నాయి. అయినప్పటికీ అప్పుడప్పుడు వచ్చే బంధువులు, ముఖ్యంగా అత్తమామల జోక్యం కొంతమందికి నచ్చకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడుతుంటాయి.

పిల్లల విషయంలో విభేదాలు

సాధారణంగా పిల్లలు ఉంటే భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుందని అంటారు. పిల్లల భవిష్యత్తు కోసం ఇద్దరూ కలిసి పని చేయడం వల్ల కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో పిల్లల అవసరాలు, ఖర్చులు, బాధ్యతల విషయంలో ఎవరు ఎక్కువ చూసుకోవాలి అనే విషయంపై చర్చలు గొడవలకు దారితీస్తాయి.

డబ్బు సంబంధిత సమస్యలు

ప్రస్తుతం చాలా కుటుంబాల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరూ సంపాదిస్తున్నప్పటికీ ఖర్చుల విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారు, ఎవరు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు అనే అంశాలు కూడా కొన్నిసార్లు గొడవలకు కారణమవుతాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా దీనిపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇంటి పనుల విషయంలో తగాదాలు

గతంలో భర్త బయట పని చేస్తే భార్య ఇంటి పనులు చూసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఇద్దరూ ఉద్యోగాలు చేయడంతో ఇంటి పనులను కూడా పంచుకోవాల్సి వస్తోంది. ఈ విషయంలో ముందుగా నిర్ణయించుకోకపోతే చిన్నచిన్న వాదనలు పెద్ద గొడవలకు దారితీస్తాయి. అలాగే పిల్లల పెంపకం బాధ్యతల విషయంలో కూడా విభేదాలు రావచ్చు. కొన్నిసార్లు భర్త భార్యకు సరిపడా సమయం ఇవ్వకపోవడం కూడా సమస్యగా మారుతుంది.

సమయం లేకపోవడం

బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా భార్యాభర్తలు ఒకరితో ఒకరు గడిపే సమయం తగ్గిపోతుంది. ముందు రోజుల్లో మధ్య మధ్యలో బయటకు వెళ్లి సమయం గడిపేవారు. కానీ ఇప్పుడు పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో అది సాధ్యం కావడం లేదు. భర్తకు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు భార్య బిజీగా ఉండటం, భార్యకు సమయం ఉన్నప్పుడు భర్త పని ఉండటం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది.

పాత విషయాలను గుర్తు చేసుకోవడం

కొన్ని సందర్భాల్లో గతంలో జరిగిన గొడవలు, చేదు అనుభవాలు ప్రస్తుత ఆనందాన్ని కూడా దెబ్బతీస్తాయి. పాత విషయాలను మళ్లీ మళ్లీ ప్రస్తావించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయి.

ఈ విధంగా అనేక కారణాలు దంపతుల మధ్య గొడవలకు దారితీస్తాయి. అందుకే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. అలా చేస్తే కుటుంబ జీవితం సుఖంగా కొనసాగుతుంది.

Also Read: Manchu Lakshmi: ’పుష్ప’ సినిమాలో ఆ డైలాగ్ నాదే…

Couple Goals: భార్యాభర్తల మధ్య తరచూ గొడవలకు కారణాలివే..!