WhatsApp: ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చాలా మందికి వాట్సాప్ లేకుండా రోజు గడవడం కష్టం. వ్యక్తిగత చాట్స్ నుంచి ఆఫీస్ పనుల వరకు ప్రతి విషయంలో ఈ మెసేజింగ్ యాప్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు కోట్లాది మంది వినియోగదారులకు వాట్సాప్ పూర్తిగా ఉచిత సేవలనే అందిస్తోంది. అయితే ఇప్పుడు మెటా సంస్థ ఒక కొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. త్వరలో ‘వాట్సాప్ ప్లస్’ (WhatsApp Plus) అనే ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకురావాలని భావిస్తోంది.
ఈ ప్రీమియం ప్లాన్ ద్వారా సబ్స్క్రిప్షన్ తీసుకునే వినియోగదారులకు కొన్ని ప్రత్యేక ఫీచర్లను అందించనున్నారు. అయితే సాధారణంగా వాట్సాప్‌ను ఉచితంగా ఉపయోగించే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని కంపెనీ చెబుతోంది. మెసేజ్‌లు పంపడం, ఫోటోలు షేర్ చేయడం, వాయిస్ లేదా వీడియో కాల్స్ చేయడం, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వంటి ముఖ్యమైన సేవలు ఎప్పటిలాగే ఉచితంగానే అందుబాటులో ఉంటాయి.
ప్రస్తుతం వాట్సాప్‌లో లైట్ మోడ్, డార్క్ మోడ్ తప్ప యాప్ రూపాన్ని మార్చుకునే అవకాశాలు ఎక్కువగా లేవు. కానీ వాట్సాప్ ప్లస్ ప్లాన్ తీసుకుంటే యాప్ లుక్‌ను పూర్తిగా మార్చుకునే అవకాశం ఉంటుంది. కొత్త థీమ్స్‌తో పాటు బటన్స్, లింక్స్ రంగులను మార్చుకునేలా ‘కస్టమ్ యాక్సెంట్ కలర్స్’ అనే ఫీచర్ ఇవ్వనున్నారు. అలాగే ఫోన్ హోమ్ స్క్రీన్‌పై కనిపించే వాట్సాప్ ఐకాన్‌ను కూడా మన ఇష్టానికి అనుగుణంగా మార్చుకునేలా దాదాపు 14 కొత్త ఐకాన్లను అందించనున్నారు.
ఇక చాట్స్ విషయంలో కూడా కొత్త మార్పులు ఉండనున్నాయి. ప్రస్తుతం వాట్సాప్‌లో ముఖ్యమైన చాట్స్‌ను పిన్ చేసుకునే అవకాశం ఉంది కానీ గరిష్టంగా మూడు చాట్స్ మాత్రమే పిన్ చేయవచ్చు. ఇది చాలా మందికి సరిపోదు. అందుకే ప్రీమియం యూజర్లకు ఈ పరిమితిని 3 నుంచి 20 చాట్స్ వరకు పెంచే అవకాశం ఇవ్వనున్నారు. దీంతో ముఖ్యమైన చాట్స్ ఎప్పుడూ పైభాగంలో కనిపిస్తాయి.
అదేవిధంగా కాల్స్ విషయంలో కూడా కొత్త ఫీచర్ రానుంది. సాధారణంగా వాట్సాప్ కాల్ వచ్చినప్పుడు అందరికీ ఒకే రకమైన రింగ్‌టోన్ వినిపిస్తుంది. ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే స్క్రీన్ చూడాల్సిందే. కానీ వాట్సాప్ ప్లస్‌లో ప్రత్యేకమైన రింగ్టోన్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఒక్కో కాంటాక్ట్‌కు ఒక్కో రింగ్‌టోన్ సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో బాస్, ఫ్రెండ్ లేదా కుటుంబ సభ్యులు ఎవరు కాల్ చేస్తున్నారో రింగ్‌టోన్ విన్న వెంటనే గుర్తించవచ్చు.
ఇంకా చాటింగ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ప్రత్యేకమైన కంటెంట్ కూడా ఇవ్వనున్నారు. ప్రీమియం యూజర్ల కోసం ఆర్టిస్టులు రూపొందించిన ప్రత్యేక స్టిక్కర్ ప్యాక్స్, కొత్త యానిమేషన్లు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే ఎమోజీ రియాక్షన్స్ కూడా మరింత ఆకర్షణీయంగా, ఇంటరాక్టివ్‌గా ఉండేలా మార్పులు చేయనున్నట్లు సమాచారం.
అయితే ఈ వాట్సాప్ ప్లస్ ప్లాన్ ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉంది. ప్రముఖ టెక్ వెబ్సైట్ WABetaInfo ప్రకారం ఈ ఫీచర్లు బీటా వెర్షన్లలో కనిపించినట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్ ధర ఎంత ఉంటుంది? ఎప్పుడు అధికారికంగా విడుదల చేస్తారు? అనే విషయాలను మెటా ఇంకా ప్రకటించలేదు. రాబోయే నెలల్లో ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వినియోగదారులకు ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
