Mid-day Meal: ఒక షాకింగ్ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. బలోద్‌బజార్ జిల్లాలోని లఛన్‌పుర్ గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జూలై 29న మధ్యాహ్న భోజనం తర్వాత 78 మంది విద్యార్థులకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే… ఆ పాఠశాలలో వంటగది వద్ద ఉంచిన కూరగాయలను ఓ వీధికుక్క నాకింది. ఇది విద్యార్థులే ముందుగా గుర్తించి టీచర్లకు చెప్పినప్పటికీ, వారు పట్టించుకోలేదు. దీంతో ఆ కూరగాయలతో వండిన భోజనం విద్యార్థులకు వడ్డించారు.
అలాగే, విషయం బయటకు వెళ్లిన తర్వాత గ్రామస్తుల ఆందోళన వ్యక్తమైంది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే పిల్లలు కలుషిత ఆహారంపై హెచ్చరించినా ఎందుకు విస్మరించారంటూ టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వంట నిర్వాహకులను తొలగించారు.
సంగటనపై ఆందోళన పెరగడంతో ఆరోగ్య శాఖ బృందాన్ని వెంటనే పాఠశాలకు రప్పించారు. విద్యార్థుల్లో ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని వైద్యులు వెల్లడించారు. కానీ ముందు జాగ్రత్త చర్యగా 78 మందికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేశారు. ఈ టీకా వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని వైద్యులు తెలిపారు.
ఈ ఘటన మరోసారి పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజన భద్రతపై ప్రశ్నలు రేపుతోంది. ఆహార భద్రత మార్గదర్శకాలను పాటించడంలో అవగాహన లోపం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు హామీ ఇచ్చారు. పిల్లల ఆరోగ్యంపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడమని స్పష్టం చేశారు.
