Vijaya Sai Reddy: విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. కొత్త రాజకీయ పార్టీపై కీలక ప్రకటన!

Vijaya Sai Reddy Announces New Political Party, Key Details Soon

Vijaya Sai Reddy: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజల తరఫున, ప్రజల కోసం పనిచేసేలా ఈ పార్టీని రూపొందించనున్నట్లు తెలిపారు. దీంతో ఏపీ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి(Vijaya Sai Reddy) నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బుధవారం ఉదయం విజయసాయిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన తదుపరి రాజకీయ కార్యాచరణపై స్పష్టత ఇచ్చారు. ప్రజల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ, వారి గొంతుకను వినిపించేందుకు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Vijayasai Reddy: Vijaya Sai Reddy Clarifies Personal Reasons Behind  Resignation

ఈ నెలలోనే కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. పార్టీ పేరు, విధివిధానాలు, జెండా, అజెండా వంటి అంశాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు. తన రాజకీయ భవిష్యత్‌పై ఇప్పటివరకు కొనసాగుతున్న ఊహాగానాలకు త్వరలోనే పూర్తిస్థాయిలో ముగింపు పలకనున్నట్లు స్పష్టం చేశారు.

Also Read: Fake Ghee: వామ్మో.. పాలు లేకుండానే నెయ్యి.. 25 టన్నులు సీజ్..!

కొత్త పార్టీ ప్రజల సమస్యలపై పోరాడే వేదికగా ఉండాలని తాను భావిస్తున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రజల తరఫున నిలబడి వారి సమస్యలను ప్రభుత్వాలు, పాలకుల దృష్టికి తీసుకెళ్లే విధంగా పార్టీ కార్యకలాపాలు ఉంటాయని పేర్కొన్నారు. అయితే పార్టీ నిర్మాణం, నాయకత్వం, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

మరోవైపు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఎల్‌నినో ప్రభావం లేకుండా దేశ ప్రజలు సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు.

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలు ఉండగా.. ఆయన ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీ ఎలాంటి విధానాలతో ముందుకు వెళ్తుంది? ఎవరిని కలుపుకుని సాగుతుంది? వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పార్టీ పేరు, జెండా, అజెండా వంటి వివరాలు వెల్లడైన తర్వాత దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also Read: Death Penalty: ఉరిశిక్షకు ఇక బ్రేక్.? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే!