Migraine: మైగ్రేన్ సమస్యతో చాలామంది ఇబ్బందిపడుతున్నారు. సాధారణ తలనొప్పితో పోలిస్తే మైగ్రేన్(Migraine) నొప్పి ఎక్కువసేపు కొనసాగడం, కొంతమందిలో వికారం, వాంతులు, వెలుతురు లేదా శబ్దం భరించలేకపోవడం వంటి లక్షణాలు కనిపించడం సాధారణం. అయితే మందులు వాడుతున్నప్పటికీ తలనొప్పి(Headache) తరచూ వస్తుంటే మాత్రం దాన్ని సాధారణ సమస్యగా తీసుకోకూడదు.
మైగ్రేన్‌కు మందులు తీసుకున్నా ఉపశమనం లభించకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. మైగ్రేన్ నిర్ధారణ సరిగ్గా లేకపోవడం, సరైన మందు లేదా మోతాదు కాకపోవడం, ఇతర రకాల తలనొప్పి ఉండటం వంటి కారణాలను వైద్యులు పరిశీలించాల్సి ఉంటుంది. అందుకే తలనొప్పి పదేపదే వస్తుంటే లేదా గతంలో కంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే న్యూరాలజిస్టు(Neaurologist)ను సంప్రదించడం మంచిది.

ముఖ్యంగా పెయిన్‌కిల్లర్ల విషయంలో జాగ్రత్త అవసరం. తలనొప్పి వచ్చిన ప్రతిసారీ స్వయంగా మందులు వేసుకోవడం, సూచించిన దానికంటే ఎక్కువ మోతాదులో తీసుకోవడం సమస్యను మరింత క్లిష్టం చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో తరచుగా అక్యూట్ తలనొప్పి మందులు ఉపయోగించడం వల్ల Medication-Overuse Headache అనే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే తలనొప్పి తగ్గించడానికి తీసుకున్న మందులనే తరచుగా ఉపయోగించడం వల్ల తలనొప్పి మరింత తరచుగా రావచ్చు. అందువల్ల వైద్యుల సలహా లేకుండా పెయిన్‌కిల్లర్ల మోతాదును పెంచడం మంచిది కాదు.
మైగ్రేన్ నియంత్రణలో జీవనశైలి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, తగినంత నీరు తాగడం, భోజనం సమయానికి చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ఉపయోగపడవచ్చు. కొందరిలో ఎక్కువసేపు ఆకలితో ఉండటం, నిద్రలేమి, అధిక ఒత్తిడి వంటి అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపించవచ్చు.
అయితే ఒక్కసారిగా జీవితంలోనే అత్యంత తీవ్రమైన తలనొప్పి రావడం, తల గాయమైన తర్వాత తీవ్రమైన నొప్పి మొదలవడం, జ్వరం, మెడ బిగుసుకుపోవడం, స్పృహ కోల్పోవడం, మాట్లాడటంలో ఇబ్బంది, శరీరంలోని ఒక వైపు బలహీనత లేదా చూపులో తీవ్రమైన మార్పులు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి.
కాబట్టి మైగ్రేన్ తగ్గడం లేదని స్వయంగా మందుల మోతాదును పెంచడం కంటే, సమస్యకు అసలు కారణాన్ని తెలుసుకుని వైద్యుల సూచనల ప్రకారం చికిత్స తీసుకోవడం ఉత్తమం.
Also Read: Bribe Demand: ఎవరైనా లంచం అడిగితే.. క్షణాల్లో పట్టించండిలా!
