Dialysis: మానవ శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు (మూత్రపిండాలు) ఒకటి. శరీరంలో ఏ అవయవానికి సమస్య ఏర్పడ్డా మనిషిని తీవ్రంగా కుంగదీస్తుంది. అందులో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలో ఉండే వ్యర్థాలను, విషపదార్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపడం కిడ్నీలు చేసే పని. అయితే రకరకాల కారణాల వల్ల (ఉదాహరణకు తీవ్రమైన మధుమేహం, అధిక బీపీ) రెండు కిడ్నీలు పనిచేయడం ఆగిపోయినప్పుడు (Kidney Failure) ఆ పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది. ఇలాంటి సమయంలో రోగి ప్రాణాలను కాపాడటానికి ‘డయాలసిస్’ (Dialysis) అనే కృత్రిమ పద్ధతిని వైద్యులు ఉపయోగిస్తారు. అసలు డయాలసిస్ ఎందుకు చేయాలి.. ఒకవేళ చేయపోతే మన శరీరంలో వచ్చే మార్పులు, సమస్యలేంటే ఇప్పుడు చూద్దాం.
1. డయాలసిస్ ఎందుకు చేయాలి?
కిడ్నీలు సహజంగా చేయాల్సిన పనిని యంత్రం ద్వారా చేయడమే డయాలసిస్. దీని వల్ల శరీరానికి కలిగే ముఖ్య ప్రయోజనాలు:
-
వ్యర్థాల తొలగింపు: రక్తంలో పెరిగే యూరియా, క్రియేటినిన్ వంటి హానికర విషపదార్థాలను శుభ్రం చేస్తుంది.
-
నీటి సమతుల్యత: శరీరంలో అధికంగా చేరిన నీటిని బయటకు తీసి, వాపులు రాకుండా చూస్తుంది.
-
రక్తపోటు నియంత్రణ: శరీరంలో రసాయనాలు, నీటి శాతం సరైన స్థాయిలో ఉంచి బీపీని అదుపులో ఉంచుతుంది.
-
ఎలక్ట్రోలైట్ సమతుల్యత: సోడియం, పొటాషియం వంటి ఖనిజాల శాతాన్ని సరిగ్గా ఉంచుతుంది.
2. డయాలసిస్ చేయకపోతే ఏమవుతుంది?
వైద్యులు డయాలసిస్ సూచించిన తర్వాత కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తే లేదా చేయించుకోకపోతే శరీరంలో తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి:
-
విషపదార్థాలు పేరుకుపోవడం (Uremia): రక్తం శుద్ధి కాకపోవడం వల్ల యూరియా స్థాయిలు విపరీతంగా పెరిగిపోయి వాంతులు, వికారం, ఆకలి మందగించడం, తీవ్రమైన బలహీనత ఏర్పడతాయి.
-
ఊపిరితిత్తుల్లో నీరు చేరడం: అదనపు నీరు బయటకు పోక ఊపిరితిత్తులలోకి చేరుతుంది. దీనివల్ల తీవ్రమైన ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.
-
గుండెపై తీవ్ర ప్రభావం: పొటాషియం స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోవడం వల్ల గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వచ్చి గుండెపోటు (Heart Attack) వచ్చే ప్రమాదం ఉంది.
-
కోమా లేదా మరణం: మెదడుపై విషపదార్థాల ప్రభావం పడి మతిమరుపు, గందరగోళం, ఫిట్స్ రావడం మరియు రోగి కోమాలోకి వెళ్లి చివరకు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
లైఫ్ సపోర్ట్ సిస్టమ్
డయాలసిస్ అనేది కిడ్నీ వ్యాధికి శాశ్వత నివారణ కాదు, కానీ అది రోగి ప్రాణాలను నిలబెట్టే ఒక లైఫ్ సపోర్ట్ సిస్టమ్. వైద్యులు డయాలసిస్ అవసరమని చెప్పినప్పుడు భయపడకుండా, సరైన సమయంలో చికిత్స తీసుకోవడం వల్ల సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు.
Also Read: Best 5G Mobiles Under 20000: 2026లో రూ.20వేల లోపు.. బెస్ట్ 5G మొబైల్స్ ఇవే!
